ప్రకృతి, ఆధ్యాత్మిక సౌందర్యాల నెలవు హిమాచల్.
*లోక్‌భవన్‌లో ఘనంగా హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ వేడుకలు.
*ఐక్యతకు ప్రతీక ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’.
* గవర్నర్ శివప్రతాప్ శుక్లా.
హైదరాబాద్, మహ.
ప్రకృతి సౌందర్యానికి, గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి హిమాచల్ ప్రదేశ్ నిలువెత్తు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లోని లోక్‌భవన్‌లో ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హిమాచల్ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఆ రాష్ట్ర విశిష్టతను, దేశ ప్రగతిలో అక్కడి ప్రజల పాత్రను కొనియాడారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా సేవలు అందించిన తాను, ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
**దేవభూమి స్ఫూర్తిదాయకం**
హిమాచల్ ప్రదేశ్ తన అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో పాటు శౌర్య సంప్రదాయాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని గవర్నర్ పేర్కొన్నారు. ‘దేవభూమి’గా పిలవబడే హిమాచల్ ఆధ్యాత్మికతకు, శాంతి సామరస్యాలకు నెలవుగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తినిస్తోందని తెలిపారు. అక్కడి వైవిధ్యభరితమైన జానపద సంస్కృతి, సాంప్రదాయ పండుగలు, జానపద నృత్యాలు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని కష్టపడి పనిచేసే నిరాడంబర స్వభావం గల ప్రజలే ఆ రాష్ట్ర ప్రగతికి మూలస్తంభాలని ఆయన ప్రశంసించారు.
**అభివృద్ధిలో ఆదర్శం**
సుస్థిర అభివృద్ధి రంగంలో హిమాచల్ ప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతులైన రోడ్లు, విద్యుత్తుతో పాటు సమృద్ధిగా నీరు అందుబాటులో ఉండటం గర్వకారణమన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రం నిరంతరం పురోగమిస్తోందని, ఈ అభివృద్ధి పథం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ తనదైన ముద్ర వేయగలిగిందని ఆయన గుర్తు చేశారు.
**ఐక్యతతోనే సుసంపన్న భారతం**
‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను అర్థం చేసుకునేందుకు, పరస్పరం గౌరవించుకునేందుకు ఒక గొప్ప వేదికని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి వేడుకలు దేశ ఐక్యతను, సమగ్రతను పటిష్ఠం చేయడంతో పాటు ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయన్నారు. భారతదేశాన్ని మరింత బలంగా, సుసంపన్నంగా, స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన హిమాచల్ జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జానకి శుక్లా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, బ్రిగేడియర్ డెక్స్టర్ నీగెల్, కల్నల్ అలోక్ బడోని తదితరులు పాల్గొన్నారు.








