ఫాతిమా ఓవైసీ కళాశాల కూల్చివేతకు రంగం సిద్ధం?
*అక్రమ కట్టడాలపై అధికారుల గురి.
*’ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు.
*కొత్త ప్రవేశాలు చేపట్టవద్దన్న హైకోర్టు.
* విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్లోని సల్కం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ కళాశాలను అధికారులు ఏ క్షణంలోనైనా కూల్చివేసే అవకాశం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువు శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇటువంటి కట్టడాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం సల్కం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణల పరిస్థితిని ప్రస్తావిస్తూ, సదరు కళాశాల మనుగడపై ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వివాదాస్పద కళాశాలలో కొత్తగా ఎటువంటి ప్రవేశాలు చేపట్టకూడదని గౌరవనీయ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని రాజా సింగ్ గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విద్యాసంస్థల పట్ల ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వివాదాస్పద సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాజా సింగ్ సూచించారు. అక్రమ నిర్మాణాల్లో నడుస్తున్న కళాశాలల్లో చేరి అనవసర చిక్కుల్లో పడకూడదని, తక్కువ ఫీజులు లేదా ఇతర ప్రలోభాలకు లోనై జీవితాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అనుమతులు లేని, వివాదాస్పద భూముల్లో ఉన్న విద్యాసంస్థల్లో ప్రవేశాలు తీసుకోవద్దని ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.








