వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స.
• ప్రతి దవాఖానలో ప్రత్యేక వైద్య బృందం.
* మంత్రి దామోదర్ రాజనర్సింహ.
*ఎండల తీవ్రతపై ఆరోగ్యశాఖ సమీక్ష.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందించాలని, ఇందుకోసం ప్రతి ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఎండల తీవ్రత, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, అగ్నిప్రమాదాల నివారణపై ఆయన ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. బాధితులు ఆస్పత్రికి వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
**రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు**
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే అవుట్ పేషెంట్లు, ఇన్-పేషెంట్లు మరియు వారి సహాయకులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. పెద్ద హాస్పిటల్స్‌లో ప్రతి బ్లాక్ మరియు ప్రతి ఫ్లోర్‌లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆవరణల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వార్డుల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, ఐసీయూ వంటి కీలక విభాగాల్లో ఏసీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే రోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు.
**అవగాహనతోనే నివారణ సాధ్యం**
వడదెబ్బ నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను కోరారు. ముఖ్యంగా ఎండలో శ్రమించే ఉపాధి హామి కూలీలు, రైతులు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని సూచించారు. బస్ స్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సోషల్ మీడియా ద్వారా జాగ్రత్తలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు నీటిని వెంట తీసుకెళ్లాలని, ఏదైనా అసౌకర్యం కలిగితే తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
**అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తం**
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఆస్పత్రుల్లోని పవర్ కేబుల్స్‌ను తనిఖీ చేయాలని, అవసరమైన చోట కొత్త వైరింగ్ చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్స్ పనితీరుపై మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, మంటలను ఆర్పే యంత్రాల గడువు తేదీలను సరిచూసుకోవాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాల్లో స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చర్యలను ఉపేక్షించవద్దని, సిబ్బందికి ఫైర్ సేఫ్టీపై తగిన శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








