పునర్విభజన సెగలు.
* భాగ్యనగర మహా రాజకీయ జాతకం.
* గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్తగా 7 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల ఆవిర్భావం.
హైదరాబాద్, మహా.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ మార్పులకు శ్రీకారం చుట్టగా, క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంచనాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్ పద్ధతి’లో పునర్విభజన జరగాలని డిమాండ్ చేస్తుండగా, మరోవైపు జనాభా విస్ఫోటనం జరిగిన శివారు ప్రాంతాల్లో కొత్త సీట్ల సంఖ్య భారీగా పెరగనుంది. **హైదరాబాద్ జిల్లా…పాత బస్తీ నుంచి కొత్త కోణాల వరకు**
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, పునర్విభజన అనంతరం మరో ఏడు సెగ్మెంట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రధానంగా పాతబస్తీ పరిధిలో ప్రస్తుతం ఉన్న చార్మినార్, బహదూర్‌పుర, చాంద్రాయణగుట్ట వంటి నియోజకవర్గాలకు తోడుగా అబిడ్స్ లేదా కోఠి కేంద్రంగా ఒకటి, చాదర్‌ఘాట్ కేంద్రంగా మరొక కొత్త నియోజకవర్గం ఏర్పడే వీలుంది. ఇక కొత్త నగరం వైపు చూస్తే, జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట మరియు బేగంపేట ప్రాంతాలు స్వతంత్ర నియోజకవర్గాలుగా ఆవిర్భవించే ప్రతిపాదనలు బలంగా ఉన్నాయి. గతంలో ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్ విడిపోయినట్లుగానే, ఇప్పుడు బంజారాహిల్స్ ఏర్పాటు దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
**ఐటీ కారిడార్‌లో సీట్ల సునామీ.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల జోరు**
2004 తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనాభా లక్షల్లో పెరిగింది. ఒకప్పుడు గ్రామాలుగా ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాలు నేడు ఆకాశహర్మ్యాలతో సింగపూర్, మలేషియాను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో శేరిలింగంపల్లి వంటి భారీ నియోజకవర్గాలను విభజించి గచ్చిబౌలి, నార్సింగి, మణికొండ, మియాపూర్, చందానగర్ పేరుతో కొత్త సెగ్మెంట్లు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు సాగుతోంది. రాజేంద్రనగర్ పరిధిలో శంషాబాద్ కొత్త నియోజకవర్గంగా అవతరించే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లా విషయానికొస్తే, ఇక్కడ కాప్రా, బోడుప్పల్, బాలానగర్ మరియు బాచుపల్లి వంటి కొత్త నియోజకవర్గాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
**లోక్‌సభ స్థానాల పెంపు..గ్రేటర్‌లో కొత్త పవర్ సెంటర్లు**
అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడమే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదనంగా రెండు లోక్‌సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ నేతలు యోచిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్ వంటి ప్రాంతాలను కలుపుతూ కొత్త ఎంపీ స్థానాల ఏర్పాటుకు ఆస్కారం ఉంది. ఇది జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో హైదరాబాద్ పాత్ర మరింత కీలకం కానుంది.







