Mahaa Daily Exclusive

  మహిళా బిల్లు ముసుగులో మోదీ సర్కార్ ‘డీలిమిటేషన్’ కుట్ర: పార్లమెంట్‌లో ప్రియాంకా గాంధీ నిప్పులు

Share

మహిళా బిల్లు ముసుగులో మోదీ సర్కార్ ‘డీలిమిటేషన్’ కుట్ర.
*కులగణన అంటే ప్రధానికి భయం ఎందుకు?
*ఓట్ల వేట కోసం ప్రజాస్వామ్యానికి బీజేపీ మరణశాసనం.
*దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకే ఈ పునర్విభజన ప్లాన్.
• ప్రియాంకా గాంధీ వాద్రా.

ఢిల్లీ, మహా.

దేశ అత్యున్నత చట్టసభ వేదికగా ఇప్పుడొక రాజకీయ అగ్నిపర్వతం బద్ధలైంది. పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీ వాద్రా తొలి ప్రసంగంతోనే కేంద్రంలోని మోదీ సర్కార్ పునాదులు కదిలేలా విరుచుకుపడ్డారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె సంధించిన బాణాలు కమలనాథులకు ఊపిరి ఆడకుండా చేశాయి. మహిళా బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించలేదని, స్వయంగా రాహుల్ గాంధీ ప్రధానిని కలిసి మద్దతు ప్రకటించారని గుర్తు చేస్తూనే.. ఈ బిల్లు వెనుక దాగి ఉన్న అసలు ‘రాజకీయ కుట్ర’ను ఆమె బట్టబయలు చేశారు. మహిళల హక్కుల విషయంలో తామే ఛాంపియన్లమని చెప్పుకుంటున్న బీజేపీ అసలు రంగును ప్రియాంకా తన పదునైన ప్రసంగంతో ఎండగట్టారు. ఇక్కడ సమస్య మహిళా బిల్లు కాదని, దాని ముసుగులో దేశ ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు సిద్ధమైన ‘డీలిమిటేషన్ బిల్లు’ అని ఆమె చేసిన గర్జన పార్లమెంట్ గోడలను వణికించింది.
నియోజకవర్గాల పునర్విభజన వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక భారీ కుట్రకు తెరలేపిందని ప్రియాంకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పెంపు ప్రక్రియ మాత్రమే కాదని, ఇది దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నమని ఆమె ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న కొన్ని రాష్ట్రాలకు ఈ బిల్లు వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని మండిపడ్డారు. కేవలం రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా బీజేపీ ఈ పావులను కదుపుతోందని, ఈ బిల్లును ఇలాగే ఆమోదిస్తే దేశంలో ప్రజాస్వామ్యం అంతమైపోతుందని ఆమె హెచ్చరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చి, దక్షిణాది ప్రాధాన్యతను తగ్గించడమే మోదీ సర్కార్ అసలు ఎజెండా అని ప్రియాంకా తన విశ్లేషణలో కుండబద్దలు కొట్టారు. అన్ని వ్యవస్థలపై ఒత్తిడి చేస్తూ, రాజ్యాంగ విలువలనే మార్చేందుకు కేంద్రం సిద్ధపడటం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో సగానికి పైగా ఉన్న ఓబీసీలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ నినాదమని, కానీ ప్రధాని మోదీ కులగణన పేరు వింటేనే ఎందుకు భయపడుతున్నారని ప్రియాంకా సూటిగా ప్రశ్నించారు. ఓబీసీల హక్కులను కేంద్రం నిరంతరం హరిస్తోందని, జనాభా ప్రాతిపదికన వారికి దక్కాల్సిన ప్రాధాన్యతను కాలరాస్తోందని ఆమె నిప్పులు చెరిగారు. కులగణన చేపడితే తమ రాజకీయ పునాదులు కదులుతాయన్న భయంతోనే మోదీ సర్కార్ దానిని అడ్డుకుంటోందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లలో కూడా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించకుండా వారిని మోసం చేశారని ప్రియాంకా మండిపడ్డారు. చట్టసభల్లో ఓబీసీల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఆ దిశగా అడుగులు వేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం కావడం బీజేపీ నైజమని ఆమె దుయ్యబట్టారు.
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కొన్ని రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని ప్రియాంకా పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు. అభివృద్ధిని, విద్యను, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గించడం అంటే వారి అభివృద్ధిని శిక్షించడమేనని ఆమె విశ్లేషించారు. ఈ వివక్షాపూరిత విధానం దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుందని హెచ్చరించారు. తన కుటుంబం ప్రాణాలర్పించింది దేశ సమగ్రత కోసమని గుర్తు చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ముక్కలు చేసే ఏ నిర్ణయానైనా అడ్డుకుంటామని ఆమె ప్రతిజ్ఞ చేశారు. ప్రియాంకా గాంధీ పార్లమెంట్‌లో చేసిన ఈ తొలి భారీ ప్రసంగం ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, గణంకాలతో సహా మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఆమె తనలోని ‘పొలిటికల్ ఫైర్‌’ను చాటుకున్నారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో మరిన్ని యుద్ధాలకు దారితీస్తాయని స్పష్టమవుతోంది.

Latest