తెలంగాణ త్యాగాల గడ్డపై బీజేపీ ‘విషపు’ పంజా.
*అమరవీరుల బలిదానాన్ని ‘పాకిస్థాన్’తో పోలుస్తావా?
• ఆత్మగౌరవంపై దాడిని సహించేది లేదు.
* తేజస్వీ సూర్యపై కేటీఆర్ ఆగ్రహం.
హైదరాబాద్, మహా.
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగ్రరూపం దాల్చారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి మాట కాదని, బీజేపీ డీఎన్ఏలోనే నిండి ఉన్న ‘తెలంగాణ వ్యతిరేకత’కు నిలువుటద్దమని ఆయన నిప్పులు చెరిగారు. ఆరు దశాబ్దాల పాటు వివక్షకు వ్యతిరేకంగా, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి, వేలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల పునాదులపై నిర్మించుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని.. రక్తం చిందిన దేశ విభజన నాటి విషాదంతో పోల్చడం బీజేపీ మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ అభివర్ణించారు. స్వయంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని గల్లీ నేతల వరకు ప్రతి ఒక్కరూ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కుతూనే ఉన్నారని, ఈ అవమానాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, దిల్లీ సుల్తానులు వేసిన భిక్ష వల్లనో ఏర్పడింది కాదని కేటీఆర్ అత్యంత పదునైన పదజాలంతో స్పష్టం చేశారు. ఒక తరం నుంచి మరో తరానికి అందిన ఉద్యమ స్ఫూర్తితో, ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన మహోద్యమ ఫలితమే ఈ గడ్డ విముక్తి అని ఆయన గుర్తు చేశారు. అస్తిత్వం కోసం ప్రజలు చేసిన పవిత్ర పోరాటాన్ని దేశ విభజన లాంటి అరాచక ఘటనతో పోల్చడం అంటే తెలంగాణ చరిత్రను, అమరవీరుల బలిదానాన్ని వెక్కిరించడమేనని ఆయన మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీకి ఉన్న కడుపుమంట ప్రతి సందర్భంలోనూ బయటపడుతోందని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో బీజేపీకి సాటిలేదని దుయ్యబట్టారు. తేజస్వీ సూర్య చేసిన ఈ పాపం కేవలం ఆయన వ్యక్తిగతమైనది కాదని, ఇది బీజేపీ పార్టీ అధికారిక విధానంగానే తాము పరిగణిస్తున్నామని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.
ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల తీరుపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో తమ కళ్ల ముందే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నా, రాష్ట్ర అస్తిత్వాన్ని అవమానిస్తున్నా నోరు విప్పని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అసలు తెలంగాణ బిడ్డలేనా అని ఆయన నిలదీశారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర గౌరవాన్ని దిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారని, ఇలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కనీసం కాంగ్రెస్ ఎంపీలు సైతం ఈ అడ్డగోలు వ్యాఖ్యలను అడ్డుకోలేకపోవడం దౌర్భాగ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలుగా గెలిచి దిల్లీలో మౌనముని వ్రతం పట్టడం అంటే తెలంగాణ ప్రజల తీర్పును వెన్నుపోటు పొడవడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే దిల్లీ గద్దెపై ఉన్న తమ యజమానుల మెప్పు పొందేందుకే ఈ ఎంపీలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే తేజస్వీ సూర్య బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం సూర్య మాత్రమే కాదు, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ బీజేపీ పార్టీ కూడా బహిరంగ క్షమాపణ కోరాలని ఆయన భీష్మించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని, ఈ విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గుండెపై తన్నిన ప్రతి బీజేపీ నేతకు ఈ గడ్డపై తిరిగే అర్హత లేదని, అమరవీరుల ఆత్మఘోష వారిని వదలదని కేటీఆర్ చేసిన గర్జన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ సెన్సేషనల్ ఇష్యూ రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణలో రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేటీఆర్ సంధించిన ఈ విమర్శనాస్త్రాల నేపథ్యంలో, తెలంగాణ ఆత్మగౌరవం కోసం మళ్ళీ ఉద్యమ జెండా ఎత్తాల్సిన అవసరం ఉందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలైంది. బీజేపీ క్షమాపణ చెబుతుందా లేక ఈ విద్వేషపు నిప్పుల వర్షం కొనసాగుతుందా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.








