Mahaa Daily Exclusive

  జనాభా ఒకరిది.. భూమి మరొకరిది.

Share

*భూమి పంపిణీలో అన్యాయం.
• రెడ్డి సామాజికవర్గం చేతిలో 13.5 శాతం భూమి.
• మాదిగలు 10 శాతం.. భూమి మాత్రం 6 శాతమే.
* పట్టిక చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
* అగ్రవర్ణాల గుప్పిట్లో భూమి..
* బహుజన వర్గాలకు అరకొర వాటా!
* జనాభా లెక్కలకు, భూమి లెక్కలకు పొంతనేది?

హైదరాబాద్, మహా.

తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే ‘స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదిక’ రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ప్రధానంగా కులాల వారీగా జనాభా నిష్పత్తికి, వారి వద్ద ఉన్న భూమికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్రంలోని భూమి అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండగా, అత్యధిక జనాభా కలిగిన సామాజికవర్గాలు భూమి లేక ఇబ్బందులు పడుతున్నట్లు గణంకాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా ఓసీ రెడ్డి సామాజికవర్గం జనాభా కేవలం 4.8 శాతంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మొత్తం భూమిలో సింహభాగం అంటే 13.5 శాతాన్ని కలిగి ఉండి అగ్రస్థానంలో నిలిచింది. అంటే జనాభా కంటే సుమారు మూడు రెట్లు అధికంగా భూమి ఆ సామాజికవర్గం వద్ద ఉండటం గమనార్హం.
నివేదికలోని గణంకాలను నిశితంగా పరిశీలిస్తే, బీసీ-డి యాదవ సామాజికవర్గం 5.7 శాతం జనాభాతో 8.7 శాతం భూమిని కలిగి ఉంది. అలాగే ఎస్టీ లంబాడీలు 6.8 శాతం జనాభాతో 8.6 శాతం భూమిని, ముదిరాజ్ సామాజికవర్గం 7.4 శాతం జనాభాతో 7.8 శాతం భూమిని కలిగి ఉన్నారు. ఈ వర్గాల వద్ద జనాభా కంటే భూమి వాటా కొంత మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. అయితే, ఎస్సీ మాదిగ సామాజికవర్గం విషయంలో పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10.3 శాతంతో అతిపెద్ద వర్గంగా ఉన్న మాదిగలకు కేవలం 6.5 శాతం భూమి మాత్రమే దక్కింది. జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ భూమి వాటా తక్కువగా ఉండటం ఈ వర్గంలో సామాజిక అసమానతలకు నిదర్శనం. అలాగే మున్నూరు కాపులు 3.9 శాతం జనాభాతో 6.4 శాతం భూమిని కలిగి ఉండి తమ ప్రాబల్యాన్ని చాటుకున్నారు.
ముస్లిం మైనారిటీల పరిస్థితి కూడా భూమి విషయంలో అత్యంత దయనీయంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. బీసీ-ఈ షేక్ ముస్లిం సామాజికవర్గం జనాభా 7.9 శాతంగా ఉంటే, వారి వద్ద ఉన్న భూమి వాటా కేవలం 2 శాతం మాత్రమే. జనాభా నిష్పత్తికి, భూమి వాటాకు మధ్య దాదాపు నాలుగు రెట్ల తేడా ఉండటం సామాజికంగా కలవరపెట్టే అంశం. మరోవైపు, ఓసీ కమ్మ వర్గం 1 శాతం జనాభాతో 2 శాతం భూమిని, ఓసీ వెలమ వర్గం 0.4 శాతం జనాభాతో 1 శాతం భూమిని కలిగి ఉన్నాయి. అంటే జనాభాతో పోలిస్తే ఈ అగ్రవర్ణాల వద్ద కూడా భూమి రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. గౌడ, రాజక, పద్మశాలి వంటి అనేక బీసీ కులాలు జనాభా కంటే తక్కువ భూమిని కలిగి ఉండి సామాజికంగా వెనుకబడి ఉన్నట్లు నివేదిక తేటతెల్లం చేస్తోంది.
సామాజిక న్యాయం జరగాలంటే భూమి పంపిణీలో అసమానతలు తొలగిపోవాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని 55వ పేజీలోని ఈ పట్టిక తెలంగాణలో అమలవుతున్న భూమి సంస్కరణల వైఫల్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఏ సామాజికవర్గానికి దక్కాల్సిన భూమి ఆ వర్గానికి అందకపోవడం వల్లే గ్రామాల్లో ఇప్పటికీ ఆర్థిక వ్యత్యాసాలు కొనసాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కుల గణన ద్వారా మాత్రమే ఈ అసమానతలకు అడ్డుకట్ట వేయగలమని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో, ఈ నివేదికలోని గణంకాలు రాబోయే రోజుల్లో రాజకీయంగా పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తున్నాయి. ఎవరి జనాభా ఎంత ఉందో, వారికి భూమిలో అంతే వాటా దక్కాలన్న డిమాండ్లు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి.