Mahaa Daily Exclusive

  ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు….

Share

ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు.
*మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలు వద్దు.
* 2029 లోపు చారిత్రక అమలు ఖాయం.
* డీలిమిటేషన్‌తో పెరగనున్న దక్షిణాది సీట్లు.
* విపక్షాల ‘భయాల’పై కేంద్ర హోంమంత్రి క్లారిటీ.
ఢిల్లీ, మహా.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్లు , నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై జరిగిన సుదీర్ఘ చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ఘాటుగా సమాధానమిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. గణాంకాలతో సహా వివరణ ఇస్తూ.. డీలిమిటేషన్ తర్వాత ఐదు దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుంచి ఏకంగా 195కు పెరుగుతుందని ఆయన వెల్లడించారు. సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా శాతం ఏమాత్రం తగ్గదని, పైగా స్వల్పంగా పెరుగుతుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గాల విభజన అనేది కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదని, ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దక్కాల్సిన అదనపు సీట్ల కేటాయింపుకు మార్గం సుగమం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలు తేదీపై విపక్షాలు చేస్తున్న విమర్శలను అమిత్ షా తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాదని, ఆచరణలో చూపిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఏప్రిల్ 16, 2026 నుంచే 2023 మహిళా రిజర్వేషన్ చట్టం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమలులోకి వచ్చిందని, దీనిని 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. 2029 వరకు జరగబోయే అన్ని ఎన్నికలు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల ప్రాతిపదికననే జరుగుతాయని, ఏ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరగబోదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. దేశ రక్షణ విజయాలను లేదా చారిత్రక సంస్కరణలను ‘మ్యాజిక్’ అంటూ తక్కువ చేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించే వారు పరోక్షంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు దక్కే రాజకీయ ప్రయోజనాలను అడ్డుకుంటున్నట్లేనని ఆయన ఘాటుగా విమర్శించారు. కుల గణన అంశాన్ని తెరపైకి తెస్తూ ప్రధాన బిల్లును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న ఈ సంస్కరణలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చివరగా, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం ద్వారా భారత్ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.