Mahaa Daily Exclusive

  వైరాపై మాట్లాడే హక్కు పువ్వాడ అజయ్ కు లేదు….

Share

 

*పొలిటికల్ పొత్తులతో మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారు..

*అధికారం పోయిందని అజయ్ అసహనంతో మాట్లాడుతున్నారు…

*రెండేళ్లలో వైరా నియోజకవర్గంలో రూ .1000 కోట్ల అభివృద్ధి జరిగింది

*కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు..

*వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 

*కారేపల్లిలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పై విమర్శలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 

కారేపల్లి, మహా :వైరా నియోజకవర్గ అభివృద్ధిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మాట్లాడే హక్కు ఏమాత్రం లేదని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో శుక్రవారం పర్యటించిన ఎమ్మెల్యే రామదాసు నాయక్ విశ్వనాథపల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజకీయ పొత్తులతో మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టు కొని అనేక రకాలుగా లబ్ధి పొందిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఏమాత్రం లేదని విమర్శించారు. గతంలో మంత్రిగా ఉన్న మీరు వైరా నియోజకవర్గానికి ఒక్క పని కూడా చేయలేదని దుయ్యపట్టారు. అధికారం కోల్పోయిన అసహనంతో అడ్డగోలుగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు వైరా నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల కు పైబడి వివిధ అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో వైరా కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరి చేయించానని పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయనీ పేర్కొన్నారు. గోదావరి నీళ్లను సాగర్ కు మళ్లించి 42 కోట్లతో రైతులకు సాగు నీరు అందించాం అని చెప్పారు. వంద పడకల ఆసుపత్రి, అటవీ హక్కు పత్రాలు పొందిన ఫారెస్ట్ భూముల్లో ఐదు బోర్లు వేయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. వైరా మున్సిపాలిటీకి పది వేల ఇందిరమ్మ చీరల పంపిణీ జరిగిందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీ సీ, బీటీ రోడ్లు మొత్తం 1372 పనులు 108 కోట్లతో పూర్తి చేయించడం జరిగిందనీ వివరించారు. 912 స్వయం సహాయక సంఘాలకు 118 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించినట్లు తెలిపారు. వైరా నియోజకవర్గంలో 4250 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించానని, అర్హులైన పేదలందరికీ దశల వారీగా మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వైరా మున్సిపాలిటీ కి 15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేయించి వైరా పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించానని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏమీ చేయలేదని మాజీ మంత్రి అజయ్ కుమార్ మాట్లాడటం సరికాదన్నారు. మీ రాజకీయ అనుభవంతో అవసరమైతే నియోజకవర్గ అభివృద్ధి కోసం మంచి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాం కానీ అనవసరపు ఆరోపణలతో మాట్లాడటం ఏమాత్రం తగదని అన్నారు. పదేళ్ల కాలంలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ గురించి గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు.

*ప్రజాసేవకే అంకితం అయ్యా….

నాకు గాని నా కుమారుడికి గాని ఎటువంటి కాంట్రాక్టులు, వ్యాపారాలు లేవని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకే అంకితం అయ్యామని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని అదే మార్గంలో పయనిస్తూ ప్రజల కోసమే పనిచేస్తున్నా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకాలను ప్రజల దరి చేర్చడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో చేసి చూపిస్తున్నధని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి మండలానికి కూడా సాగునీరు వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశం కాంగ్రెస్ నాయకులు రామారావు, పతే మహమ్మద్, పగడాల మంజుల, బానోతు రామ్మూర్తి దుగ్గినేని శ్రీనివాసరావు, విష్ణువర్ధన్ రెడ్డి, అడ్డగోడ ఐలయ్య, మేదరి టోనీ, పెద్దబోయిన ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.