హసీనా అప్పగింత అభ్యర్థనపై న్యాయ సమీక్ష.
* బంగ్లాతో మైత్రిని పటిష్టం చేస్తాం.
* విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ .
ఢిల్లీ, మహా.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ ఆ దేశం నుంచి అందిన అధికారిక అభ్యర్థనపై భారత ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని చట్టపరమైన, న్యాయ మార్గాల ద్వారా క్షుణ్ణంగా సమీక్షిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న అనేక నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వంతో తన భాగస్వామ్యాన్ని స్థిరీకరించుకోవడానికి భారత్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రక్రియ అంతర్గత చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటుందని, సంబంధిత వర్గాలన్నింటితో నిర్మాణాత్మకంగా చర్చలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వంతో వాణిజ్యం, ఇంధనం, ప్రాంతీయ భద్రత వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త ప్రతిపాదనలను అన్వేషించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే ఆకాంక్షను విదేశాంగ మంత్రి ఇప్పటికే వ్యక్తం చేశారని, ఇరు దేశాల దృక్పథాలను ఏకీకృతం చేయడానికి త్వరలోనే అధికారిక సమావేశాలు ఏర్పాటు కానున్నాయని జైశ్వాల్ పేర్కొన్నారు. షేక్ హసీనా అప్పగింత అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ, పొరుగు దేశంతో పటిష్టమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకే భారత్ మొగ్గు చూపుతోంది. 2024 జూలైలో విద్యార్థుల ఉద్యమంతో అధికారం కోల్పోయిన హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో, ఆమెను తిరిగి అప్పగించాలని బంగ్లాదేశ్ గతంలోనే లేఖ రాసింది.
గతంలో షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య అత్యంత సాన్నిహిత్య సంబంధాలు ఉండేవి. అయితే ఆమె నిష్క్రమణ తర్వాత మహ్మమద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హయాంలో సంబంధాలు కొంత మేర క్షీణించాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించడంతో, ఇరు దేశాల మధ్య మళ్ళీ పూర్వపు మైత్రి చిగురిస్తుందని దౌత్య వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ మార్పులను భారత్ నిశితంగా గమనిస్తోందని, ప్రాంతీయ శాంతికి పెద్దపీట వేస్తూ బంగ్లాదేశ్తో నిర్మాణాత్మక పద్ధతిలో కలిసి పనిచేయడానికి నిరంతరం శ్రమిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి వివరించారు.
ఇదే క్రమంలో అంతర్జాతీయ పరిణామాలపై స్పందిస్తూ, ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణకు భారత్ అధికారిక మద్దతు ప్రకటించింది. పశ్చిమాసియాలో ప్రాంతీయ స్థిరత్వాన్ని లక్ష్యంగా చేసుకునే అన్ని శాంతి ప్రయత్నాలను తాము స్వాగతిస్తామని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన ఈ 10 రోజుల కాల్పుల విరమణను శాంతి దిశగా పడిన తొలి అడుగుగా భారత్ అభివర్ణించింది. అలాగే ఇరాన్-అమెరికాల మధ్య శాంతి ప్రక్రియలో పాకిస్థాన్ ప్రమేయం వంటి అంశాలను కూడా భారత్ నిశితంగా గమనిస్తోందని రణధీర్ జైశ్వాల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.







