బీజేపీ నిరంకుశత్వానికి చెంపపెట్టు.
* ప్రజాస్వామ్యానిదే విజయం.
*లోక్‌సభలో బిల్లు వీగిపోవడం ‘ఇండియా’ కూటమి ఘనతే.
* మంత్రి పొన్నం ప్రభాకర్**
హైదరాబాద్, మహా.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి ఏమాత్రం తావులేదని లోక్‌సభ వేదికగా స్పష్టంగా నిరూపితమైందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సంఖ్యాబలం ఉందన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు వీగిపోవడం బీజేపీ నిరంకుశత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన అభివర్ణించారు. చట్టాలను నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చాలనే కుట్రలను తిప్పికొట్టిన ‘ఇండియా’ కూటమి ఎంపీలకు ఆయన హ్యాట్సాఫ్ చెప్పారు. లోక్‌సభలో రెండింట మూడొంతుల మెజారిటీకి 54 ఓట్లు తక్కువ రావడం ద్వారా బిల్లు వీగిపోవడంతో బీజేపీ పరిస్థితి చనిపోయిన శవంలా తయారైందని ఎద్దేవా చేశారు. డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ద్వారా దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగేలా సీట్లు పెంచే కుట్రకు తెరలేపారని, దానికి మహిళా బిల్లును సైతం ఉద్దేశపూర్వకంగా ముడిపెట్టడం బీజేపీ కపట బుద్ధికి, రాజకీయ నిరంకుశత్వానికి నిదర్శనమని పొన్నం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‌పై కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు ఎందుకు తీసుకోలేదని ఆయన నిలదీశారు.
మహిళల సాధికారత గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఏమాత్రం లేదని పొన్నం ప్రభాకర్ తేల్చిచెప్పారు. గత 44 సంవత్సరాలుగా బీజేపీకి కనీసం ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా లేకపోవడం వారి పితృస్వామ్య భావజాలానికి అద్దం పడుతోందన్నారు. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తుచేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో పంచాయతీరాజ్ చట్టం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన చరిత్ర తమ పార్టీ సొంతమన్నారు. దేశానికి తొలి మహిళా ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, పార్టీ అధ్యక్షురాలిని అందించిన కాంగ్రెస్ పార్టీయే అసలైన మహిళా పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ మేయర్ స్థానంలో ఒక మహిళ కూర్చున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ చలవేనని ఆయన ఉదహరించారు. మహిళల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న బీజేపీ, మహిళా బిల్లు పేరుతో పక్కదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా బిల్లును వచ్చే ఎన్నికల్లోనే అమలు చేయాలని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కచ్చితంగా సబ్ కోటా ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానమని ఆయన ఉద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల ఆకాంక్ష, ఎంతో మంది విద్యార్థులు, యువకుల బలిదానాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని, భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అదే సభలో ఉన్న రాష్ట్ర బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణలకు కనీసం చీము, నెత్తురు లేదా అని ఆయన తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. కాకినాడ తీర్మానంలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’ అని చెప్పి తెలంగాణ ఏర్పాటును జాప్యం చేసింది బీజేపీయేనని ఆయన విమర్శించారు. సీమాంధ్రులు వ్యతిరేకించినా, అద్వానీతో చర్చలు జరిపినా, ఎన్నో అడ్డంకులు ఎదురైనా సోనియా గాంధీ చిత్తశుద్ధితో ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్లో ఆమోదం తెలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్ రెడ్డి, నేడు తమ ఎంపీ తప్పు చేశాడని ఒప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.
తెలంగాణ సాధన కోసం కాళ్లు మొక్కిన చరిత్ర, అలాగే పార్లమెంట్లో వీరోచితంగా కోట్లాడిన చరిత్ర తమకు ఉందని పొన్నం స్పష్టం చేశారు. తమ రాష్ట్రానికి ఏమాత్రం అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తేజస్వి సూర్య చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను వెంటనే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించకపోతే, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణలు చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం రాజకీయానికి సంబంధించిన విషయం కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే అసలైన మహిళా రిజర్వేషన్ బిల్లు అమవులవుతుందని, తెలంగాణ మహిళలు బీజేపీ కుట్రలను అర్థం చేసుకుని వాటిని తిప్పికొట్టాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.








