Mahaa Daily Exclusive

  కాలి నడక కష్టాలకు చెక్…

Share

* ఆ ఊరిలో తొలిసారిగా రేషన్ పంపిణీ.
*45 కిలోమీటర్ల భారాన్ని తగ్గించిన యంత్రాంగం.
* హితుల్ గ్రామంలో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు.
చత్తీస్గడ్ , మహా.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆ కుగ్రామానికి కనీస సదుపాయాలు మృగ్యమే. పూట గడవడానికి ప్రభుత్వమిచ్చే గుప్పెడు రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే అక్షరాలా 45 కిలోమీటర్లు అడవి దారిన కాలి నడకన వెళ్లాల్సిందే. తీరా అక్కడికి వెళ్లాక ఆ బియ్యం బస్తాలను తల మీద పెట్టుకుని అదే దారిలో అతి కష్టం మీద ఊరు చేరుకోవాలి. దశాబ్దాలుగా ఆ గిరిజనులు పడుతున్న ఈ కష్టాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అధికారుల చొరవతో ఆ ఊరిలో చరిత్రలో మొట్టమొదటిసారిగా రేషన్ పంపిణీ జరిగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత నారాయణపుర్ జిల్లా పరిధిలో జరిగిన ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
**అసలెక్కడ ఉందంటే..**
నారాయణపుర్ జిల్లాలోని అత్యంత దట్టమైన అటవీ ప్రాంతమైన అబుజ్‌మద్ (ఓర్చా) బ్లాక్‌లో థుల్థులీ గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే ఒక మారుమూల కుగ్రామమే ‘హితుల్’. మావోయిస్టులకు కంచుకోటగా భావించే ఈ ప్రాంతానికి చేరుకోవడమే అత్యంత కష్టంతో కూడుకున్న పని. కనీస రవాణా సదుపాయాలు లేని ఈ ఊరికి, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కింద రేషన్ బియ్యం అందించాలని జిల్లా యంత్రాంగం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. అధికారుల చొరవతో పౌరసరఫరాల శాఖ సిబ్బంది ఆ ఊరికి నేరుగా వెళ్లి సరుకులు అందించారు.
**ఆ కష్టాలు వర్ణనాతీతం..**
ఇప్పటి వరకు హితుల్ గ్రామస్తులు తమ నెలవారీ రేషన్ తీసుకోవాలంటే ఓర్చా గ్రామం వరకు కాలి నడకన వెళ్లాల్సి వచ్చేది. రానుపోను సుమారు 45 కిలోమీటర్ల కఠినమైన అటవీ మార్గంలో ప్రయాణించడం వారికి నిత్యకృత్యంగా మారింది. ఎగుడుదిగుడుగా ఉండే దారిలో బియ్యం మూటను తలపై పెట్టుకుని రావడం గర్భిణులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు నరకప్రాయంగా ఉండేది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే థుల్థులీ నుంచి ఓర్చా వెళ్లే మార్గం బురదమయమై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో వాతావరణం అనుకూలించక గ్రామస్తులు తరచుగా తమ రేషన్‌ను సమయానికి తీసుకోలేక పస్తులుండే పరిస్థితులు కూడా తలెత్తేవి.
**ట్రాక్టర్‌లో నేరుగా ఊరికే..**
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, జిల్లా అధికారులు ఒక ట్రాక్టర్ ద్వారా ఆహార ధాన్యాలను నేరుగా హితుల్ గ్రామానికే తీసుకువచ్చారు. రేషన్ బియ్యంతో పాటు నెయ్యి, ఉప్పు, పంచదార, శనగలు వంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. తమ సొంత ఊరిలో, తమ కళ్ల ముందే రేషన్ పంపిణీ జరుగుతుండటం చూసి గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ విలువైన సమయంతో పాటు, శారీరక శ్రమ, డబ్బును ఆదా చేసిన జిల్లా యంత్రాంగానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
**కొత్త జీవితానికి నాంది..**
హితుల్ వంటి అత్యంత మారుమూల ప్రాంతాలకు ట్రాక్టర్లను ఉపయోగించి ఆహార ధాన్యాలను రవాణా చేశామని జిల్లా ఆహార అధికారి అలావుద్దీన్ ఖాన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సరికొత్త విధానం ద్వారా ఇకపై ప్రతి నెలా రేషన్ క్రమం తప్పకుండా గ్రామస్తులకు వారి ఊరిలోనే అందుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల హితుల్ గ్రామంలో ఉన్న 271 మంది రేషన్ కార్డుదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. అబుజ్‌మద్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రారంభించిన ఈ వినూత్న కార్యక్రమం, గిరిజనుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చొరవ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపిందని కొనియాడుతున్నారు.

Latest