Mahaa Daily Exclusive

  మహిళల స్వప్నాన్ని చిదిమేశారు: విపక్షాల తీరు భ్రూణహత్యతో సమానం – ప్రధాని మోదీ ఆగ్రహం!

Share

మహిళల స్వప్నాన్ని చిదిమేశారు.
* విపక్షాల తీరు భ్రూణహత్యతో సమానం.
* కాంగ్రెస్, మిత్రపక్షాల పాపానికి శిక్ష తప్పదు..
* స్వార్థం కోసం మహిళల ఆత్మాభిమానంపై దాడి.
* డీలిమిటేషన్ ఒక సాకు మాత్రమే.
* ఆ పరాన్నజీవి పార్టీలకు నారీశక్తి గుణపాఠం చెబుతుంది!
* విపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ

ఢిల్లీ, మహా.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశంలోని సగం జనాభా ఆత్మాభిమానంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో విపక్షాల తీరుపై మోదీ నిప్పులు చెరిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు మహిళల స్వప్నాలను చిదిమేశాయని మండిపడ్డారు. ఈ చారిత్రక తప్పిదానికి దేశ మహిళా లోకానికి తాను క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించిన ప్రధాని, రిజర్వేషన్లు అడ్డుకున్న వారిని మహిళలే కఠినంగా శిక్షిస్తారని హెచ్చరించారు.
**మహిళల కలలను ఛిద్రం చేశారు.. నా క్షమాపణలు**
పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా కుట్ర పన్నాయో యావత్ దేశం కళ్లారా చూసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల స్వార్థ రాజకీయాలకు దేశంలోని మహిళా లోకం బలైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నారీశక్తి ఎదుగుదలను అడ్డుకుని వారి కలలను ముక్కలు చేశారని దుయ్యబట్టారు. ఎంతో నిజాయితీతో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు ఘోరమైన పాపం చేశాయని, ఈ పాపానికి వారికి భవిష్యత్తులో తగిన శాస్తి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు దేశ నారీమణులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.
**సంబరాలా?.. ఇది భ్రూణహత్యతో సమానం!**
బిల్లును ఓడగొట్టిన ఆనందంలో విపక్షాలు చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల ఆత్మాభిమానంపై దాడి చేసి సంతోషిస్తున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తీరును అక్షరాలా భ్రూణహత్యతో ఆయన పోల్చారు. తమకు జరిగిన ఈ ఘోర అన్యాయాన్ని దేశ మహిళలు ఎప్పటికీ మర్చిపోరని, రాబోయే రోజుల్లో వారే స్వయంగా ఈ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కుటుంబ వారసత్వ పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీలు మహిళలను ఎప్పటికీ రాజకీయంగా ఎదగనీయవని, 40 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం సాగుతున్న పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశాయని ఆయన విమర్శించారు. మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చి క్రెడిట్ అంతా మీరే తీసుకోవాలని విపక్ష నేతలకు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పెడచెవిన పెట్టారని మోదీ గుర్తుచేశారు. తమకు ఎప్పుడూ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, కానీ విపక్షాలకు మాత్రం దేశం కంటే రాజకీయాలే పరమావధి అని ఆయన దుయ్యబట్టారు.
**కాంగ్రెస్ ఒక పరాన్నజీవి.. డీలిమిటేషన్ కేవలం సాకే**
దేశంలో క్రమంగా సొంత ఉనికి కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక పరాన్నజీవిలా మారిపోయిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇతర ప్రాంతీయ పార్టీల భుజాల మీద ఆధారపడి మనుగడ సాగిస్తోందని విమర్శించారు. వాస్తవానికి డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి లేదా ఏ ఇతర రాష్ట్రానికి అన్యాయం జరగదని, అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా అత్యంత శాస్త్రీయంగా ఈ విధానాన్ని తీసుకువస్తున్నామని పదే పదే చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు కావాలనే వినలేదన్నారు. దేశ ప్రజలను ప్రాంతాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ విచ్ఛిన్నకర ఆలోచన అని, ఆ కుట్రలో భాగంగానే డీలిమిటేషన్‌ను ఒక సాకుగా చూపిస్తూ మహిళా రిజర్వేషన్లను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. మహిళల పట్ల దారుణంగా వ్యవహరించి, పార్లమెంటు వేదికగా నారీశక్తిని అవమానించిన ఈ ప్రతిపక్షాలకు దేశ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.

Latest