Mahaa Daily Exclusive

  మల్ల వచ్చేది కేసీఆర్ సర్కారే…

Share

  • మల్ల వచ్చేది కేసీఆర్ సర్కారే
  • హైడ్రాను ఎత్తి అవతల పారేస్తాం
  • మొదటి సంతకం దానిపైనా..
  • హైదరాబాద్ లో హైడ్రా.. నిజామాబాద్ లో నిడ్రా అట..
  • పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు
  • *వెయ్యి జన్మలెత్తినా.. నేను చావను నా కొడకా
  • జగిత్యాల సభలో కేసీఆర్ నిప్పులు
  • జీవన్ రెడ్డి సేవలు రాష్ట్రస్థాయిలో వాడుకుంటామని ప్రకటన

జగిత్యాల, మహా

మొన్న కేవలం 1.7 శాతం ఓట్లతోనే ఓడిపోయాం. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు. మళ్లీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం.. ఈసారి బంపర్ మెజార్టీతో వస్తాం” అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైడ్రా తెచ్చింది కాక దాన్ని జిల్లాలకూ తెస్తామంటున్నారని, బీఆర్‌ఎస్‌ రాగానే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని, పనికిమాలిన హైడ్రాను పీకేసేందుకే తొలి సంతకం పెడతాని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. హైద్రాబాద్ లో హైడ్రా తెస్తే.. నిజామాబాద్ లో నిడ్రా వస్తదని పీసీసీ అధ్యక్షుడు అంటున్నారు. జగిత్యాలకు జిడ్రా వస్తదా? అని ఎద్దేవా చేశారు. సీనియర్ నాయకులు టీ. జీవన్ రెడ్డికి కేసీఆర్ స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, జీవన్ రెడ్డి కేవలం జగిత్యాల కోసమే కాకుండా తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం బీఆర్ఎస్‌లోకి వచ్చారని కొనియాడారు. ఆయనను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించడమే కాకుండా, రాబోయే ప్రభుత్వంలో ఆయనకు అత్యంత కీలకమైన పదవిని అప్పగిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

రైతుబంధుకు రాంరాం
తమ పదేళ్ల పాలనలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను రాజును చేశామని, కానీ నేడు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. రైతుబంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాంరాం చెప్పిందని, దళితబంధును జై భీమ్ అంటూ అటకెక్కించారని మండిపడ్డారు. “నేను ఇక్కడ సభ పెడుతున్నానని తెలిసి ఇవాళ రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేశారు.. మరి మూడో విడత వేయాలంటే నేను మళ్లీ సభ పెట్టాలా?” అని ఆయన వేసిన ప్రశ్న ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టింది. వ్యవసాయ రంగం కుదేలవుతోందని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

**మూసీ సుందరీకరణ వెనుక భారీ కుట్ర
మూసీ నది ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూసీని శుభ్రం చేయడం మంచిదే కానీ, ఆ పేరుతో 15 వేల పేదల ఇళ్లను కూలగొట్టడం ఏ రకమైన ధర్మమని ఆయన నిలదీశారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జరుగుతున్న కుట్ర అని, బడా వ్యాపారులకు మేలు చేసేందుకే పేదల ఇళ్లను బలి ఇస్తున్నారని ఆరోపించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదలకు అండగా బీఆర్ఎస్ నిలుస్తుందని, వారి ఇళ్లను తాకనిచ్చే ప్రసక్తే లేదని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజాధనాన్ని ఇలాంటి వినాశకర పనులకు కాకుండా అభివృద్ధి పనులకు వెచ్చించాలని ఆయన హితవు పలికారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుబంధు, దళితబంధులను గాలికి వదిలేసి రైతులను, పేదలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు. వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. అంటూ ఘాటుగా స్పందించారు. అభివృద్ధి ముచ్చట లేదని, కేవలం పాలకుల చిల్లర మాటలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని ధ్వజమెత్తారు.
.

**నాడు గంజి కేంద్రాలు.. నేడు అంధకారం

తెలంగాణ సాధన కోసం తాను చేసిన ఉద్యమాన్ని, అప్పట్లో ఉన్న దుర్భర పరిస్థితులను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాలమూరు నుంచి 90 శాతం వలసలు ఉండేవని, తిండి లేక గంజి కేంద్రాలు నడిచిన రోజులను తాము మార్చి తెలంగాణను సస్యశ్యామలం చేశామని చెప్పారు. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చే ‘మిషన్ భగీరథ’ను అద్భుతంగా అమలు చేశామని, కానీ నేడు మళ్లీ మంచి నీళ్ల కోసం ప్రజలు గోస పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు నిరంతరాయంగా నీరు ఇస్తే ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మళ్లీ వెనక్కి తీసుకెళ్తున్నారని ఆయన మండిపడ్డారు.

420 హామీలతో మోసం..కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కేసీఆర్ ‘420’ హామీలుగా అభివర్ణించారు. అధికారంలోకి రావడం కోసం అసాధ్యమైన మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని ధ్వజమెత్తారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వంచించారని, దళితబంధును ఆపివేసి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో గెలిచిన పార్టీ ఎక్కువ కాలం నిలవదని, ప్రజలు అప్పుడే తమ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

**రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరం..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేసీఆర్ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉండేదని, నేడు భూమి అమ్మేవాడు ఉన్నాడు కానీ కొనేవాడు దిక్కులేడని ఆయన విశ్లేషించారు. రాష్ట్ర ఆదాయం పడిపోవడానికి పాలకుల అసమర్థతే కారణమని, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. పల్లె ప్రకృతి వనాలు ఎండిపోతున్నాయని, మున్సిపాలిటీలు మురికికూపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేని పాలన వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆయన హెచ్చరించారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనలను కేసీఆర్ గుర్తు చేస్తూ, తెలంగాణ వ్యతిరేక శక్తులతో ప్రస్తుత ప్రభుత్వం చేతులు కలిపిందని ఆరోపించారు. కరెంట్ ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజలు రోడ్లపైకి వస్తే కాల్చి చంపిన ఘటన తనను ఉద్యమం వైపు నడిపించిందని చెప్పారు. నేడు మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సంతకం చేసిందని విమర్శించారు. మోదీ మెడపై కత్తి పెట్టినా తాను మీటర్లు పెట్టనివ్వలేదని, కానీ ఈ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బుల కోసం సంతకం పెట్టి రైతులకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.

**బంపర్ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి..

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “మొన్న కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయాం.. అది ప్రజలు మాపై కోపంతో ఇచ్చిన తీర్పు కాదు, కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి చేసిన పొరపాటు” అని ఆయన విశ్లేషించారు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలను గ్రహిస్తున్నారని, మళ్లీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తామని కేడర్‌లో ఉత్సాహం నింపారు. ఈసారి గెలుపు మామూలుగా ఉండదని, బంపర్ మెజార్టీతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన జ్యోస్యం చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజలు మళ్లీ గులాబీ జెండా వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.

షాపులో లేని యూరియా యాప్ లో ఉంటుందా?

వ్యవసాయ రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళంపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తమ హయాంలో ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేస్తే ఎన్ని అంటే అన్ని యూరియా బస్తాలు ఇంటికి వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రైతులు యాప్‌లు పట్టుకుని తిరుగుతూ కాళ్లు వాపులు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పంట వేసిన దగ్గర నుంచి కొనేవరకు రైతులకు అండగా నిలబడే వ్యవస్థను కాంగ్రెస్ పతనం చేసిందని మండిపడ్డారు. మక్కలు కొనే దిక్కులేదని, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చారని వాపోయారు. రైతు పక్షపాతిగా ఉన్న బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే అన్నదాతలకు అసలైన న్యాయం జరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు.

** తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్లీ అంకురార్పణ**
జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల నుంచే మళ్లీ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కానీ తాము వదలబోమని చెప్పారు. కూల్చివేతలు, కాల్చివేతలు తప్ప ఈ ప్రభుత్వానికి మరేమీ తెలియదని, అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని మళ్లీ నడిపించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉందని చెప్పారు. జగిత్యాల నుంచి ప్రారంభమైన ఈ జైత్రయాత్ర రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి చేరుతుందని, గులాబీ జెండా మళ్లీ సగర్వంగా ఎగరబోతోందని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.