Mahaa Daily Exclusive

  ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌…..

Share

*నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ జీవో జారీ..
* మే 1 నుంచి ప్రక్రియ షురూ.
హైదరాబాద్‌,మహా.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపికబురు అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. వచ్చే నెల (మే) 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలకు అనుమతి లభించింది.
పరిపాలనా సౌలభ్యం, ఉద్యోగుల విజ్ఞప్తుల మేరకు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను ఈ జీవోలో పొందుపరిచింది. ఒకే స్థానంలో కనీసం మూడు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన ఉద్యోగులను బదిలీ చేసేందుకు సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అదే సమయంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఒకేచోట నాలుగేళ్లకు మించి ఒకే పోస్టింగ్‌లో కొనసాగడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. బదిలీల ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిబంధనలకు లోబడి కేటాయించిన ఈ ఒక్క నెల రోజుల్లోనే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సొంత ప్రాంతాలకు లేదా అనువైన చోట విధులు నిర్వర్తించాలనుకునే వేలాది మంది ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లయింది.