Mahaa Daily Exclusive

  ఆర్టీసీ సమ్మె సైరన్: నేటి తొలి షిఫ్ట్ నుంచే నిలిచిపోనున్న బస్సులు

Share

**నేటి తొలి షిఫ్టు నుంచే ఆర్టీసీ సమ్మె**
**ప్రభుత్వ తీరుపై జేఏసీ ఆగ్రహం.. ఆస్తుల ప్రైవేటీకరణపై ధ్వజం**
**సమ్మెకు మద్దతు పలికిన ప్రజా సంఘాలు.. నారాయణపేట డిపోలో సిబ్బంది ధర్నా**
** హైదరాబాద్‌, మహా**
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, రెండో వేతన సవరణ (పీఆర్సీ), విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు తదితర డిమాండ్ల సాధన కోసం 22వ తేదీ ఉదయం తొలి షిఫ్టు నుంచే పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తమను చర్చలకు పిలవకపోవడం, కనీస నివారణ చర్యలు తీసుకోకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్మిక, ప్రజా సంఘాలు ఈ సమ్మెలో పెద్ద ఎత్తున భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎలక్ట్రిక్‌ బస్సుల సాకుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని జేఏసీ నేతలు ఆరోపించారు. సంస్థను హైదరాబాద్‌లో లేకుండా చేసి, విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచనలో సర్కార్‌ ఉందన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియను కేవలం కాలయాపన కోసమే వాడుకుంటున్నారని, అందుకోసమే కమిటీ వేశారని విమర్శించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేసుకుంటున్న సర్కార్, ఆర్టీసీని ఎందుకు పట్టించుకోవడం లేదని జేఏసీ ఛైర్మన్‌ ఈదురు వెంకన్న ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సంస్థకు అద్దె బస్సులు నడుపుతున్న నిర్వాహకులు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సైతం ఈ సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ దఫా ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెను తలపిస్తుందని జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం ఉద్ధృతం అవుతుందని స్పష్టం చేసింది. ఈ సమ్మెకు తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మరోవైపు సమ్మె సన్నాహక దినంగా పాటిస్తూ నారాయణపేట డిపోలో కార్మికులు ధర్నాకు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ అశ్వద్ధామ రెడ్డి పిలుపు మేరకు సిబ్బంది ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న రెండు పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని, పనిభారాన్ని తగ్గించాలని, డైరెక్టర్ల నియామకం, యూనియన్ల పునరుద్ధరణ చేపట్టాలని కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వమే నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలని స్పష్టం చేశారు.