Mahaa Daily Exclusive

  పశ్చిమాసియా యుద్ధ సెగ: భారత్‌లో 24.6 శాతం పడిపోయిన ఎరువుల ఉత్పత్తి

Share

వార్‌ ఎఫెక్ట్‌.
*భారత్‌లో పావు వంతు పడిపోయిన ఎరువుల ఉత్పత్తి.
*పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడిసరుకు దిగుమతులకు బ్రేక్‌.
*వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం.
*మార్చిలో 24.6 శాతం క్షీణతను నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ.
హైదరాబాద్, మహా.
పశ్చిమాసియాలో భగ్గుమన్న యుద్ధ ప్రభావం భారత్‌లోని వ్యవసాయ రంగంపైనా తీవ్రంగా పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు చేయడంతో తలెత్తిన ఉద్రిక్తతలు మన దేశ ఎరువుల ఉత్పత్తిని భారీగా దెబ్బతీశాయి. దేశీయంగా ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు దిగుమతులకు అకస్మాత్తుగా ఆటంకం కలగడంతో.. గత మార్చి నెలలో భారత్‌లో ఎరువుల ఉత్పత్తి ఏకంగా పావు వంతు (24.6 శాతం) మేర పతనమైందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతకుముందు డిసెంబర్‌లో 4.1 శాతం, జనవరిలో 3.7 శాతం, ఫిబ్రవరిలో 3.4 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసిన ఎరువుల ఉత్పత్తి.. ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం గమనార్హం.
మన దేశ వ్యవసాయ రంగంలో యూరియా వాడకం అత్యంత కీలకం. ఈ యూరియా తయారీకి సహజ వాయువు ఎంతో అవసరం. అయితే, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ ఇంధన, ఎరువుల ముడిసరుకు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్ మూసివేసింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మూడో వంతు ఎరువులు, వాటి ముడిసరుకులు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంటాయి. ఈ జలసంధి మూసివేత కారణంగా సహజ వాయువుతో పాటు రాక్ ఫాస్ఫేట్, ఫాస్ఫోరిక్ యాసిడ్, పొటాష్ వంటి కీలక ముడిసరుకుల దిగుమతులు నిలిచిపోవడమే దేశీయంగా ఎరువుల ఉత్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన ఈ ఎరువుల రవాణా అంతరాయాలు ప్రపంచ ఆహార భద్రతకు పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోని రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని, ఇతర దేశాల నుంచి ముడిసరుకు సేకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ భరోసా ఇస్తోంది. రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో ఎరువుల ధరల పెరుగుదల భారం అన్నదాతలపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఏప్రిల్ మొదట్లోనే సబ్సిడీలను సైతం 11 శాతం పెంచిన విషయం తెలిసిందే.