* టీడీపీ వర్సెస్ జనసేన.
*ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో భగ్గుమన్న వర్మ.
*వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేతలు పెండెం దొరబాబు, తుమ్మలబాబు.
*కూటమి శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట.. ఉద్రిక్తత.
కాకినాడ,మహా.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య ప్రోటోకాల్ వివాదం తీవ్ర చిచ్చురేపింది. మంగళవారం పడా కార్యాలయంలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకుల నడుమ తీవ్ర వాగ్వాదం జరిగి, ఏకంగా భౌతిక ఘర్షణ వాతావరణానికి దారితీసింది.
**వివాదానికి కారణమిదే..**
ఎన్యుమరేటర్లకు మొబైల్స్ (ట్యాబ్‌లు) పంపిణీ చేసేందుకు పడా కార్యాలయంలో ఒక కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, ఆ కార్యక్రమం కోసం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడాన్ని పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోను మాత్రమే ఉంచి సీఎం ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన అధికారులను నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో తప్పనిసరిగా ఉండి తీరాలని, ముఖ్యమంత్రికే గౌరవం లేనప్పుడు తాము ఇక్కడ ఎందుకు ఉండాలంటూ వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుతోనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
**వర్మపైకి దూసుకెళ్లిన జనసేన నేతలు**
వర్మ అధికారులను ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు జోక్యం చేసుకుని కాస్త దురుసుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబు ఈ వివాదంలో కలుగజేసుకున్నారు. “పిచ్చిపిచ్చి వేషాలొద్దు” అంటూ నేరుగా వర్మపైకి దూసుకెళ్లారు. దాదాపు వర్మపై భౌతికంగా దాడి చేసేంతలా పరిస్థితి వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన ఇరు పార్టీల తోటి నేతలు దొరబాబును నిలువరించారు.
**తోపులాట.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన వివాదం**
ముఖ్య నేతల మధ్య బహిరంగంగా వాగ్వాదం జరగడంతో అక్కడే ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరగడంతో పడా కార్యాలయ ప్రాంగణం కాసేపు రణరంగంగా మారింది. ఏ పార్టీ అరాచకాలపై అయితే తాము పోరాటం చేశామో.. అదే పార్టీ నుంచి వచ్చిన నాయకులు ఇప్పుడు తమ మీదే పెత్తనం చెలాయిస్తున్నారంటూ వర్మ ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలైన జనసేన, టీడీపీల మధ్య ఏకంగా పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.








