Mahaa Daily Exclusive

  రీల్స్ వ్యామోహం….

Share

* బాలుడి ప్రాణం బలి.
*నాచారంలో విషాదం
హైదరాబాద్, మహా.
సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందాలనే ఆరాటం, ప్రమాదకర విన్యాసాలు చేయాలనే ఉబలాటం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల్లో ‘రీల్స్’ చేస్తూ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఒక 14 ఏళ్ల బాలుడు, ఆ క్రమంలో చేసిన సాహసం వికటించి మృత్యువాత పడ్డాడు. నాచారంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చి నాచారం మల్లాపూర్ పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో నివసిస్తోంది. ఆ కుటుంబానికి చెందిన మితున్ (14) స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నాడు. గత కొంతకాలంగా తన స్నేహితులు మరియు తోటివారు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అవ్వడం చూసిన మితున్, తను కూడా అటువంటి వీడియోలతో గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కేవలం సాధారణ వీడియోలు కాకుండా, కాస్త భిన్నంగా రిస్కీ స్కిట్స్ (ప్రమాదకర విన్యాసాలు) చేస్తే త్వరగా ‘లైక్స్’, ‘వ్యూస్’ వస్తాయనే ఆలోచన అతడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఈ క్రమంలో తన నివాసంలోని బాల్కనీ రైలింగ్ మరియు పిట్టగోడపై ప్రమాదకరమైన ఫీట్లు చేస్తూ రీల్స్ చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పట్టుతప్పి భవనం పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిన వేగానికి బాలుడికి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మితున్ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్లముందే పెరుగుతున్న కుమారుడు ఇలా సామాజిక మాధ్యమాల పిచ్చితో ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
సాంకేతికత అందుబాటులోకి రావడంతో చిన్నారులు, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ప్రాణాలను పణంగా పెట్టి విన్యాసాలు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సోషల్ మీడియా వినియోగంపై తగిన జాగ్రత్తలు చెప్పాలని సామాజిక విశ్లేషకులు సూచిస్తున్నారు. కేవలం క్షణికకాలం వచ్చే గుర్తింపు కోసం అమూల్యమైన ప్రాణాలను బలి తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మల్లాపూర్ బస్తీలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.