Mahaa Daily Exclusive

  రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు – బండి సంజయ్ తీవ్ర విమర్శలు

Share

  • రేవంత్ రాహువు….కేసీఆర్ కేతువు
  • ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారు
  • కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే
  • రూ.9 వేల కోట్లపై సీబీఐ విచారణ కాదు లక్ష కోట్లపై కోరాలి
  • కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల్లో చెప్పిన రేవంత్ సీఎం అయ్యాక రూ.9 వేల కోట్లకే పరిమితమై సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ అవినీతి బయటపడాలంటే రూ.లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను కాపాడాలనే ఉద్దేశంతోనే డిజైన్ లోపాలతో నిర్మించిన మేడగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ కోరుతున్నారని చెప్పారు. రేవంత్ కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారన్నారు. నిజానికి తెలంగాణకు పట్టిన శని కేసీఆర్, రేవంత్ అని అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి రాహు కేతువులంటూ పురాణంలో అమృత మథనం సమయంలో స్వర్పణుడు అనే రాక్షసుడు దేవత వేషం వేసుకుని అమృతం దొంగిలించాలని చూస్తే విష్ణువు వచ్చి అతని తల నరికేస్తారు. ఆ తల కేసీఆర్, మొండెం రేవంత్ రెడ్డి అని సంజయ్ అన్నారు. ఇద్దరూ కలిసి డ్రామాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోందన్నారు. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక బీఆర్ఎస్ నేతలు కొందరు అలిగి ఢిల్లీ పోయారని ఒక పక్క అంటూనే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని మరోపక్క మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదని మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ది, భవిష్యత్తులో జరిగేది కూడా అదే అని అన్నారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదని, ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారో జీవన్ రెడ్డి చెబితే బాగుండేదన్నారు.