Mahaa Daily Exclusive

  ప్రజల పక్షాన కొత్త పోరాటం: 25న పార్టీ ప్రకటన, యువతకే అగ్రతాంబూలం – కల్వకుంట్ల కవిత

Share

  • ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు
  • బల ప్రదర్శనకు పాకులాడుతున్న రెండు పార్టీలు
  • 25 న కొత్త పార్టీ ఏర్పాటు
  • యువతకే పెద్ద పీట
  • జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మహా : రాష్ట్ర రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలుకుతూ 25వ తేదీన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలో యువతకే పెద్ద పీట వేస్తామన్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను విస్మరించి కేవలం బల ప్రదర్శనకే పరిమితమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ పిట్ట కథలు, బిఆర్ఎస్ ఉట్టి కథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని, ప్రజల అసలైన వెతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చే కార్యకర్తలకు, వాహనాలకు ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని ఆమె పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

కురువృద్ధులే యువకులైతే ఎలా?

జగిత్యాల బిఆర్ఎస్ సభలో 75 ఏళ్ల జీవన్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటూ ఆయనకు వయసు తగ్గిందని వ్యాఖ్యానించడంపై కవిత ఘాటుగా స్పందించారు. 75 ఏళ్ల కురువృద్ధులే నవ యువకులైతే, వారే తెలంగాణకు దిక్కు అంటే.. మరి రాష్ట్రంలోని యువత పరిస్థితి ఏంటి? వారంతా చచ్చిపోయారా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో యువతకు కొరత లేదని, కానీ పార్టీలు వారికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తన కొత్త పార్టీలో యువ రక్తానికి ప్రాధాన్యత ఉంటుందని, రాజకీయాల్లో ఒక గొప్ప మార్పును తీసుకువస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు

బిఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, వేయి ఏళ్లయినా ఆ పార్టీ తీరు మారదని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమికి ప్రజలను బ్లేమ్ చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడమే కాకుండా, వారు భిక్షాటన చేస్తారంటూ అవమానకరంగా మాట్లాడటం సరికాదన్నారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ వంటి కీలక అంశాలపై బిఆర్ఎస్ సభలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆ పార్టీ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

రేవంత్ రెడ్డిపై ధ్వజం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా కవిత తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. వచ్చే పదేళ్ల పాటు తానే సీఎంనని చెప్పుకోవడం ప్రజలను కించపరచడమేనని, ఆ విషయాన్ని ప్రజలే ఓటు ద్వారా నిర్ణయిస్తారని గుర్తు చేశారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా సీఎం మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి లోపాయికారీగా గుంట నక్కలతో డీల్స్ మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతు

రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, కరెంట్ కోతలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని కవిత మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని, తక్షణమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఆమె, ఆర్టిజన్లను బెదిరించి సమ్మె విరమింపజేయడం దారుణమన్నారు. ఒక ఆడబిడ్డగా, కొత్త తరహా రాజకీయాలతో ప్రజల సెంట్రిక్ ఎజెండాతో ముందుకు వస్తున్నానని, తనను ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.