Mahaa Daily Exclusive

  వెయ్యేళ్లయినా మారదు….

Share

* గులాబీ బాటలో ‘ప్రజలే తప్పు’ అన్నట్లుంది.
* అధికార, ప్రతిపక్షాలపై కల్వకుంట్ల కవిత నిప్పులు.
హైదరాబాద్ , మహా.
రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపునకు సమయం ఆసన్నమైందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఈ నెల 25వ తేదీన ఒక నూతన రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వెయ్యేళ్లు గడిచినా భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) తన తీరు మార్చుకోదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోగా ప్రజలనే తప్పు పట్టే స్థాయికి దిగజారడం దురదృష్టకరమని ఆమె మండిపడ్డారు. ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి, ప్రజలను చులకన చేస్తూ మాట్లాడటం బీఆర్ఎస్ అహంకారానికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు. ప్రజల కోసం నిలబడే ఒక ఆడబిడ్డగా తాను ఈ నెల 25న కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానని, ప్రజలంతా తరలివచ్చి ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పునరేకీకరణ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న విన్యాసాలను కవిత తీవ్రంగా ఆక్షేపించారు. 75 ఏళ్ల కురువృద్ధుడిని పార్టీలో చేర్చుకుని, ఆయనకే 25 ఏళ్లు తగ్గిపోయాయని, ఆయనో నవ యువకుడని వర్ణించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. మరి తెలంగాణలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటని ఆమె నిలదీశారు. జగిత్యాల సభ సాక్షిగా తెలంగాణ వ్యతిరేక శక్తులను అక్కున చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, ఉద్యమ కాలంలో పదవులకు రాజీనామా చేయమంటే వైఎస్ నాయకత్వమే ముద్దని అన్న వ్యక్తిని ఇప్పుడు నెత్తిన పెట్టుకోవడం ఉద్యమకారులను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రక్తం చిందించిన ఉద్యమకారులు నేడు భిక్షాటన చేసే స్థితికి వచ్చినా, బీఆర్ఎస్ నాయకత్వం వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
జాతీయ రాజకీయాల గురించి గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్, లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోయినా, డీలిమిటేషన్ మరియు జనగణనపై కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నా పల్లెత్తు మాట అనకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడూ గౌరవం ఉండదని, అందుకే మహిళా రిజర్వేషన్లపై వారి గొంతు పెగలడం లేదని ఆరోపించారు. ఒకవైపు బీఆర్ఎస్ ‘ఉత్తి కథలు’ చెబుతుంటే, మరోవైపు కాంగ్రెస్ ‘పిట్టకథలు’ చెబుతూ కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి, కేవలం బలప్రదర్శనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘నువ్వు ఎంత అంటే.. నేను అంత’ అనే చందంగా సాగుతున్న ఈ రాజకీయాలకు స్వస్తి పలకాలని, అందుకే తాము ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా కొత్త రాజకీయ శక్తితో వస్తున్నామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కూడా కవిత నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పులను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కేసులో ఫలానా తీర్పు వస్తుందని ముఖ్యమంత్రి ముందే ఎలా చెబుతారని, ఇది రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేయడమేనని నిలదీశారు. ఢిల్లీలో ‘గుంటనక్క’ ఎవరిని కలిసిందో చెప్పాలని, అసలు సీఎంకి ఆ గుంటనక్కతో ఉన్న ‘డీల్’ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేస్తాననడానికి రేవంత్ రెడ్డి ఎవరని, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలో నిర్ణయించేది ప్రజలని ఆమె గుర్తు చేశారు. పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న ధీమా ఎక్కడిదని, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, రైతు భరోసా పూర్తి చేయకుండా ప్రజలు మళ్ళీ ఎందుకు ఓట్లు వేస్తారని ఆమె ప్రశ్నించారు.
హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడం వంటి చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతోందని కవిత హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను అడ్డుకుంటామని ప్రకటించారు. ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న జరగబోయే తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, యువత భారీగా తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి ఇప్పటికే కార్యకర్తలు పాదయాత్రగా బయలుదేరారని, వచ్చే కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని పోలీసులను కోరారు. సమస్యలు ఉన్నచోట పోరాటమే లక్ష్యంగా తమ ప్రస్థానం సాగుతుందని ఆమె స్పష్టం చేశారు.