Mahaa Daily Exclusive

  భూమి పోయె.. పరిహారం పాయె….

Share

* బాధితుల కడుపుకోత.
* హైదరాబాద్‌లో నాగర్‌కర్నూలు రైతుల ఉగ్రరూపం.
హైదరాబాద్,మహా.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సర్వస్వాన్ని కోల్పోయి, ప్రభుత్వం ఇచ్చిన పరిహారంతోనైనా బతుకు బండిని లాగిద్దామనుకున్న నిర్వాసిత రైతుల ఆశలను ఒక ఘరానా మోసం అడియాసలు చేసింది. ప్రాజెక్టు కోసం భూములు ధారబోసిన అమాయక రైతులను నమ్మించి, వారి నోటికాడ ముద్దను లాగేసుకున్న ఒక ఫైనాన్స్ వ్యాపారి ఉదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సుమారు 25 గ్రామాలకు చెందిన 3,000 మందికి పైగా నిర్వాసితుల నుండి ఏకంగా రూ.250 కోట్ల రూపాయలను నొక్కేసిన ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో బాధితులంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ కష్టార్జితాన్ని కాజేసిన కేటుగాళ్ల కోసం వేట మొదలుపెట్టిన బాధితులు, మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో భారీ ఎత్తున ధర్నాకు దిగారు. కళ్ళముందే తమ బతుకులు బుగ్గిపాలవుతుంటే చూడలేక, న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ నిందితుడి ఇంటి ముందు బైఠాయించారు.
ఈ భారీ మోసానికి సూత్రధారిగా ‘ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్’ నిర్వాహకుడు ఇట్యాల సాయిబాబా అని బాధితులు ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలీశ్వర్, ఇట్యాల తుకారాం, నాగం కరుణాకర్ రెడ్డి, నాగం బుచ్చిరెడ్డి, రెవెల్లి జానకిరామ్ రెడ్డి, తాడురి శ్రీనివాస్ అనే వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద నాగర్‌కర్నూల్, కొల్హాపూర్ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతుల వద్దకు వెళ్లిన ఈ ముఠా, వారి వద్ద ఉన్న పరిహారం డబ్బులపై ఆశ చూపింది. తాము తక్కువ ధరకే భూములు ఇప్పిస్తామని, తమ ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడి పెడితే భారీగా వడ్డీలు చెల్లిస్తామని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సొమ్ముతో తమ భవిష్యత్తును వెతుక్కుందామనుకున్న వేలాది మంది రైతులు, వీరి మాటలు నమ్మి కోట్ల రూపాయలను వారి చేతుల్లో పెట్టారు. తీరా అసలు, వడ్డీ చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి నిందితులు ముఖం చాటేయడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.
న్యాయం కోసం అన్ని మార్గాలను అన్వేషించిన బాధితులు చివరకు హైకోర్టును ఆశ్రయించగా, నిందితుల ఆస్తులను జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిందితుల్లో ఒకరైన ధనుంజయ్ గుప్తా కుషాయిగూడలోని సుభాష్ నగర్ కాలనీలో తలదాచుకున్నాడన్న సమాచారంతో, సుమారు 300 మంది బాధితులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. నిందితుడి నివాసాన్ని ముట్టడించి, తమ డబ్బులు తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనకు పౌర సమాజ నేత పాశం యాదగిరి అండగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ.. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. భూములు కోల్పోయిన రైతులకు చట్టబద్ధంగా అందాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయడంలో వైఫల్యం చెందడం వల్లే ఇలాంటి మోసగాళ్లు అమాయక రైతులను బలి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ధనుంజయ్ గుప్తాతో పాటు ఇతర నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, వారిని సామాజికంగా బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
తమ గోడును వెళ్లగక్కుతున్న రైతుల కన్నీటి గాథలు ఎవరినైనా కలచివేస్తున్నాయి. “ప్రాజెక్టు కోసం మా పొలాలు పోయాయి, ఇళ్లు పోయాయి.. ఉన్న ఊరుని వదిలిపెట్టి వస్తున్న మాకు ప్రభుత్వం ఇచ్చిన పరిహారమే ఏకైక ఆధారం. ఆ డబ్బులతో పిల్లల పెళ్లిళ్లు చేద్దామని, మళ్ళీ ఎక్కడైనా చిన్న భూమి కొనుక్కుందామని ఆశపడ్డాం. కానీ ఈ మోసగాళ్లు మా నమ్మకాన్ని తాకట్టు పెట్టుకుని మమ్మల్ని నడిరోడ్డున పడేశారు” అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 3,000 మంది జీవితాలను అంధకారంలోకి నెట్టిన ఈ రూ.250 కోట్ల కుంభకోణంపై ప్రభుత్వం మరియు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాలనీల మధ్య తలదాచుకుంటున్న నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమాయక రైతుల శవాల మీద పేలాలు ఏరుకునే రకం ఈ మోసగాళ్లని, వీరిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు.