హైదరాబాద్, మహా.
సంధ్యా కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శరణాల శ్రీధర్ రావు మరోమారు చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. గతంలో అనేక భూవివాదాలు, ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై తాజాగా సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు మరో భారీ మోసం కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నకిలీ పత్రాలతో నమ్మించి, సుమారు 14.85 కోట్ల రూపాయలు కాజేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కుట్రలో శ్రీధర్ రావుతో పాటు ఆయన భార్య సంధ్యకు కూడా భాగస్వామ్యం ఉందని తేలడంతో, పోలీసులు ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
వివరాల్లోకి వెళితే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఎథెనా ప్రాజెక్ట్స్ సంస్థ 2021 ప్రాంతంలో హైదరాబాద్లో వ్యాపార విస్తరణ కోసం భూముల వేటలో ఉంది. ఆ సమయంలో శ్రీధర్ రావు, ఆయన భార్య సంధ్య సదరు సంస్థ ప్రతినిధులను కలిసి, నగరంలోని పలు ప్రాంతాల్లో తమకు విలువైన భూములు ఉన్నట్లు నమ్మబలికారు. ఆ భూములకు తామే యజమానులమని చెబుతూ కొన్ని ఫోర్జరీ పత్రాలు, నకిలీ డాక్యుమెంట్లను చూపించి వారిని నమ్మించారు. ఆ భూములను విక్రయిస్తామని ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ రూపంలో మొత్తం 14.85 కోట్ల రూపాయలను వసూలు చేశారు. అయితే, నగదు అందిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.
కొద్దిరోజుల తర్వాత నిందితులు బాధితులకు అందుబాటులో లేకుండా పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన ఎథెనా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ విజయ్ భాస్కర్, తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని శ్రీధర్ రావును కోరారు. ఆ సమయంలో శ్రీధర్ రావు తన పలుకుబడిని ఉపయోగించి బాధితులను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ సంపాదనను మళ్లించే క్రమంలో ‘సంధ్యా కన్స్ట్రక్షన్స్’ పేరును ‘సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్’గా మార్చినట్లు కూడా సంస్థ ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో శ్రీధర్ రావుపై పదుల సంఖ్యలో కేసులు ఉండటం గమనార్హం. తాజా ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, త్వరలోనే వారిని విచారణకు పిలిచే అవకాశం ఉందని వెల్లడించారు.








