* బెంగుళూరులో పైశాచిక ఉదంతం.
* ప్రపోజల్ అని నమ్మించి కాళ్లు, చేతులు కట్టేసి ఘాతుకం.
* మంటల్లో కాలిపోతుంటే వీడియో తీస్తూ వికృతానందం.
బెంగుళూరు,మహా.
ప్రేమ మత్తులో మునిగితేలాల్సిన ఆ బంధం.. కక్షతో రగిలిపోయింది. తనను పట్టించుకోవడం లేదన్న చిన్నపాటి కోపంతో ఓ యువతి.. నిండు ప్రాణాన్ని అత్యంత కిరాతకంగా బలితీసుకుంది. తనను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని నమ్మించి పిలిచి, కాళ్లు చేతులు కట్టేసి, కళ్లకు గంతలు కట్టి సజీవ దహనం చేసిన ఘటన బెంగుళూరు నగరంలోని రాజాజీనగర్ పరిధిలో కలకలం సృష్టించింది. మంటల్లో కాలిపోతూ బాధితుడు నరకయాతన అనుభవిస్తుంటే.. ఆ దృశ్యాలను కళ్లారా చూస్తూ ఫోన్లో వీడియో తీసిన ఆ యువతి పైశాచికత్వం సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాజీనగర్‌లోని భాష్యం సర్కిల్ వద్ద ఉన్న ఒక ‘వీఐ’ స్టోర్లో కిరణ్, ప్రేమ అనే యువతీయువకులు సహోద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమకు దారితీసింది. అయితే గత కొద్దిరోజులుగా కిరణ్ తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ప్రేమ మనస్తాపానికి గురైంది. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపం ఆమెలో పగగా మారింది. ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిశ్చయించుకున్న ఆ యువతి, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కిరణ్‌ను తన ఇంటికి పిలిచింది.
తన ప్రేమను కొత్తగా ప్రపోజ్ చేస్తానని నమ్మబలికిన ప్రేమ.. కిరణ్‌ను ఒక కుర్చీలో కూర్చోబెట్టింది. ప్రపోజల్ ప్లాన్‌లో భాగంగానే ఇదంతా చేస్తున్నానని చెబుతూ అతని కళ్లకు గంతలు కట్టి, కాళ్లు చేతులను తాళ్లతో బిగించింది. కిరణ్ అనుమానంతో ప్రశ్నించగా.. “ఇది నీకోసం నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ప్రపోజల్” అని అబద్ధం చెప్పి నమ్మించింది. అతను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడని నిర్ధారించుకున్నాక, ముందే సిద్ధం చేసుకున్న కిరోసిన్‌ను కిరణ్‌పై కుమ్మరించి నిప్పంటించింది. మంటలు అంటుకుని కిరణ్ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం చూపని ఆ కిరాతకురాలు, కళ్లముందే అతను కాలిపోతుంటే తన ఫోన్లో ఆ ఘోరాన్ని వీడియో తీసింది. తీవ్ర గాయాలపాలైన కిరణ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఇంట్లో కిరోసిన్ ముందుగానే సిద్ధం చేసుకోవడం, వీడియో తీయడం వంటి అంశాలు ఆమె క్రూరమైన ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. తోటి ఉద్యోగుల మధ్య చిగురించిన ప్రేమ బంధం ఇలా సజీవ దహనంతో ముగియడం నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.








