Mahaa Daily Exclusive

  అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌….

Share

ఫైల్ నెంబర్ 15

అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌.
* ఆశయాలను అమలు చేస్తున్న భాజపా.
*రాహుల్‌గాంధీకి తెలివి లేదు.
* రేవంత్‌రెడ్డి ట్రాప్‌లో పడుతున్నారు.
* జీడీపీ ఆధారంగా సీట్ల పెంపు ప్రతిపాదనపై విమర్శలు.
* బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడవునా అడుగడుగునా అవమానించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం
హైదరాబాద్‌లోని సోమాజీగూడ జయ గార్డెన్స్‌లో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల ముగింపు సదస్సులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యానంతరం నెహ్రూ కేబినెట్‌లో చేరినప్పటికీ, అంబేడ్కర్‌ ప్రతిపాదించిన మహిళా హక్కులు, హిందూ కోడ్ బిల్లును తోసిరాజని ఆయన రాజీనామాకు కారకులయ్యారని గుర్తు చేశారు. అంటరానితనం, పేదరికం సాకుతో ఆయనను చిన్నచూపు చూసిన కాంగ్రెస్, బాబాసాహెబ్ మరణించిన తర్వాత ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించడానికి కనీసం రెండు గజాల స్థలాన్ని కూడా కేటాయించలేదని, పీవీ నరసింహారావుకు జరిగిన అవమానం వంటిదే నాడు అంబేడ్కర్‌కు కూడా ఎదురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
**భారతరత్న ఎగవేత.. ఫిరాయింపుదారులకు పురస్కారాలు**
చరిత్రలో అంబేడ్కర్‌ ప్రాధాన్యతను తగ్గించేందుకు కాంగ్రెస్‌ అనేక నీచమైన కుట్రలు చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో తమకు తామే భారతరత్న పురస్కారాలను ప్రకటించుకున్నారని, కానీ రాజ్యాంగ నిర్మాతకు మాత్రం ఆ గౌరవం దక్కకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. చివరికి అంబేడ్కర్‌ పార్ధివ దేహాన్ని ముంబైకి తరలిస్తే, ఆ విమాన చార్జీల బిల్లులను కూడా ఆయన కుటుంబానికి పంపిన నీచ చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. అంతేకాకుండా, అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపి కుట్రలు చేయడమే కాక, ఆయనను ఓడించిన అభ్యర్థికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన ఘనత కూడా ఆ పార్టీదేనని ఎద్దేవా చేశారు.
**పంచ తీర్థాలతో బాబాసాహెబ్‌కు భాజపా గౌరవం**
అంబేడ్కర్‌ ఆశయాలను, సిద్ధాంతాలను గల్లీగల్లీకి తీసుకెళ్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి ప్రాంతాలను ‘పంచ తీర్థాలు’గా అభివృద్ధి చేసి ఆయన గొప్పతనాన్ని ప్రధాని మోదీ చాటిచెబుతున్నారని తెలిపారు. 1990లో భాజపా మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం హయాంలోనే అంబేడ్కర్‌కు భారతరత్న దక్కిందని, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యారంటే అది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లేనని మోదీ గారు సగర్వంగా ప్రకటించడాన్ని ఆయన ప్రస్తావించారు.
**జీడీపీ ఆధారంగా సీట్ల పెంపు.. రేవంత్‌రెడ్డి పిచ్చి ప్రతిపాదన**
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రతిపాదనలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీడీపీ ఆధారంగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచాలన్న రేవంత్ ప్రతిపాదన అత్యంత మూర్ఖత్వంతో కూడుకున్నదని విమర్శించారు. ఒకవేళ జీడీపీని ప్రామాణికంగా తీసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 70 శాతం సీట్లు కేటాయించాల్సి వస్తుందని, దీనివల్ల గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. ఈ ప్రతిపాదన అమలైతే రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ఉనికి కోల్పోతుందని, ములుగు, కొమరం భీం వంటి గిరిజన జిల్లాలకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం ఉండదని ఆయన విశ్లేషించారు.
**రాహుల్‌గాంధీపై ‘ట్రాప్’ రాజకీయం**
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కనీస తెలివి లేదని, అందుకే ఆయన రేవంత్‌రెడ్డి వేస్తున్న ట్రాప్‌లో చిక్కుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ స్థానాన్ని ఆక్రమించాలని రేవంత్‌రెడ్డి లోలోపల కుట్రలు పన్నుతున్నారని, అందులో భాగంగానే ఇలాంటి అర్థరహితమైన ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడంతో కాంగ్రెస్ నేతలే రాహుల్, రేవంత్‌లను తిట్టుకుంటున్నారని, సొంత పార్టీలోనే ఈ ప్రతిపాదనలపై వ్యతిరేకత మొదలైందని ఆయన పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను, ప్రాంతీయ సమతుల్యతను దెబ్బతీయాలని చూడటం సరికాదని హితవు పలికారు.
**మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి**
మహిళా ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని బండి సంజయ్ దుయ్యబట్టారు. పార్లమెంట్ సాక్షిగా ఇండీ కూటమి పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని కోట్లాది మంది మహిళలకు ఆ పార్టీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కేవలం వారసత్వ రాజకీయాల్లో ఉన్న కుటుంబాల మహిళలకే పదవులు దక్కాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, కానీ సామాన్య మహిళలకు 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు భాజపా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహిళా సాధికారత అనేది అంబేడ్కర్‌ కన్న కల అని, దానిని నెరవేర్చే బాధ్యతను మోదీ ప్రభుత్వం భుజాన వేసుకుందని ఆయన వివరించారు.
**సంక్షేమ పథకాల్లో అంబేడ్కర్‌ ఆలోచనా విధానం**
అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించడమే అంబేడ్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని, మోదీ ప్రభుత్వం ఆ దిశగా అద్భుతమైన విజయాలు సాధించిందని సంజయ్ తెలిపారు. 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలు తెరవడం, 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, 81 కోట్ల మందికి ఉచిత రేషన్ వంటి పథకాలు అంబేడ్కర్‌ ఆర్థిక ఆలోచనల ప్రతిరూపాలని ఆయన పేర్కొన్నారు. ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ, ఎస్టీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా నేరుగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేసి ఆదుకున్నామని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్, గ్యాస్ సౌకర్యం కల్పించిన ఘనత భాజపాదేనని ఆయన గర్వంగా ప్రకటించారు.
**ఆర్టికల్ 370 మరియు అంబేడ్కర్‌ దార్శనికత**
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేడ్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. నాటి నెహ్రూ ప్రభుత్వం బాబాసాహెబ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఆ నిబంధనను చేర్చి దేశానికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టిందని విమర్శించారు. అంబేడ్కర్‌ లా మినిస్టర్‌గా ఉన్నప్పటికీ ఆయనను సంప్రదించకుండానే ఈ నిర్ణయాలు తీసుకున్నారని, అది ఆయనను తీవ్రంగా గాయపరిచిందని తెలిపారు. దశాబ్దాల తర్వాత మోదీ ప్రభుత్వం ఆ అధికరణను రద్దు చేసి అంబేడ్కర్‌ కన్న కలను నిజం చేసిందని, తద్వారా కాశ్మీరీ ప్రజలకు కూడా భారత రాజ్యాంగ ఫలితాలు అందుతున్నాయని ఆయన వివరించారు.
**అంబేడ్కర్‌ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం**
అతి పేదరికంలో పుట్టి, వీధి లైట్ల కింద చదువుకుని ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన అంబేడ్కర్‌ జీవితం నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుందని సంజయ్ పిలుపునిచ్చారు. బరోడా మహారాజు వద్ద మాట తప్పకుండా పనిచేసిన ఆయన నిజాయితీ, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి దేశం కోసం సేవ చేసిన తీరు అద్వితీయమని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా సామాన్యుడికి ఓటు హక్కు కల్పించి, అధికారాన్ని కట్టబెట్టిన మహనీయుడి ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. భాజపా ప్రభుత్వం ఎల్లప్పుడూ అంబేడ్కర్‌ బాటలోనే నడుస్తుందని, అట్టడుగు వర్గాల వికాసానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.