**ఆర్టీసీ డ్రైవర్‌పై కిరాతక దాడి!**
**మండిపడ్డ ఆర్టీసీ ఎండీ.. నిందితుడిపై కేసు నమోదు**
హైదరాబాద్, మహా.
విధినిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిపై, అదీ ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌పై ఒక వ్యక్తి పట్టపగలే బరితెగించి దాడికి పాల్పడటం నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కేవలం నిర్ణీత స్టాపులోనే బస్సు ఆపానన్న ఒక్క కారణంతో, నిబంధనలను పాటించిన డ్రైవర్‌ను సీటులో నుంచి కిందకు లాగి విచక్షణారహితంగా బాదిన ఘటన సామాన్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జాలబావి ఐటీ హబ్ వద్ద ఆదివారం ఉదయం ఈ దౌర్జన్యం చోటుచేసుకుంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, ఒక శ్రామికుడిపై భౌతిక దాడికి దిగిన నిందితుడిపై పోలీసులు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
**మాటకు మాట.. ఆపై భౌతిక దాడి**
సంఘటన వివరాల్లోకి వెళితే.. నల్గొండ రూరల్ పరిధిలో తల్లా రామ్ కుమార్ అనే డ్రైవర్ పల్లెవెలుగు బస్సును నడుపుతూ ఆదివారం ఉదయం 8:10 గంటల సమయంలో ఐటీ హబ్ సమీపంలోని నిర్ణీత స్టాప్ వద్ద నిలిపారు. అదే సమయంలో తన బైక్‌పై (TS-05-FJ-9301) అక్కడికి చేరుకున్న తుపాకుల వెంకటేశం అనే వ్యక్తి, డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. బస్సును స్టాపులో కాకుండా మధ్యలోనే ఎందుకు ఆపలేదని నిలదీశాడు. బస్సును కేవలం ప్రభుత్వం నిర్దేశించిన స్టాపుల వద్దే ఆపుతామని, మధ్యలో ఆపడం నిబంధనలకు విరుద్ధమని డ్రైవర్ రామ్ కుమార్ ఎంతో సంయమనంతో సమాధానం చెప్పారు. అయితే, ఆ సమాధానంతో సంతృప్తి చెందని వెంకటేశం, అహంకారంతో డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక, బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌ను స్టీరింగ్ సీటులో నుంచి బలవంతంగా కిందకు లాగి పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
**గాయపడ్డ డ్రైవర్ – పోలీసుల ఎంట్రీ**
నిందితుడు వెంకటేశం చేసిన ఈ అకస్మాత్తు దాడిలో డ్రైవర్ రామ్ కుమార్ కుడి కంటి పైన తీవ్రమైన గాయం కావడమే కాకుండా, మోకాలికి కూడా బలమైన దెబ్బలు తగిలాయి. తోటి ప్రయాణికులు అడ్డుకున్నప్పటికీ నిందితుడు రౌడీలా ప్రవర్తించాడు. బాధితుడు వెంటనే నల్గొండ రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సైదా బాబు తక్షణమే స్పందించారు. నిందితుడు తుపాకుల వెంకటేశంపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 118(1), 352 కింద ఎఫ్ఐఆర్ (90/2026) నమోదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం తీవ్రమైన నేరమని, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
**సిబ్బందికి అండగా ఉంటాం: ఎండీ హెచ్చరిక**
ఈ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తీవ్రంగా స్పందించారు. విధినిర్వహణలో ఉన్న సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడటం సహించరాని విషయమని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రజల సౌకర్యం కోసమే పని చేస్తారని, వారి రక్షణే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సిబ్బందిని ఇబ్బంది పెడితే అటువంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. డ్రైవర్ రామ్ కుమార్ కు సంస్థ పూర్తి అండగా ఉంటుందని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షిస్తామని నాగిరెడ్డి హామీ ఇచ్చారు.








