Mahaa Daily Exclusive

  సజ్జల భార్గవ్ విచారణ ముగింపు…

Share

**సజ్జల భార్గవ్ విచారణ ముగింపు**
**పోలీసుల ప్రశ్నలకు ‘తెలియదు..గుర్తులేదు’**
**తాడపల్లి సోషల్ మీడియా మాఫియా గుట్టుమట్టు**
**విచారణలో భార్గవ్ రెడ్డి నీళ్లు నమలడం చర్చనీయాంశం**
**విద్వేష పోస్టుల వెనుక అసలు సూత్రధారి ఎవరు? రెండో రోజు విచారణలో డీఎస్పీ ప్రశ్నల వర్షం**
విజయవాడ, మహా.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సోషల్ మీడియా వేదికగా విద్వేషాల విషం చిమ్మడం, ప్రత్యర్థి పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై సాగుతున్న విచారణ ఆదివారం ఉదయానికి ఒక కొలిక్కి వచ్చింది. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పాటు సాగిన ఈ విచారణ ప్రక్రియలో పోలీసులు అనేక కీలక అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు మహిళా నేతలను, రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులను కించపరిచేలా సాగిన పోస్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు భార్గవ్ రెడ్డిని నిలదీశారు. ఏప్రిల్ 25న ప్రారంభమైన ఈ విచారణ పర్వం ఆదివారం ముగిసింది.
విచారణ సందర్భంగా సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ మురళీ నాయక్ నేతృత్వంలోని బృందం సంధించిన అనేక సూటి ప్రశ్నలకు భార్గవ్ రెడ్డి నీళ్లు నమలడం గమనార్హం. 2022 నుంచి తాడపల్లి కేంద్రంగా సాగిన సోషల్ మీడియా కార్యకలాపాలు, అక్కడ జరిగిన రహస్య భేటీలు, పోస్టుల రూపకల్పనలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. అయితే మెజారిటీ ప్రశ్నలకు ఆయన ‘తెలియదు’, ‘గుర్తులేదు’ అంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పెట్టిన అభ్యంతరకర పోస్టుల వెనుక ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే అంశంపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
ఈ కేసు విచారణలో హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరుల గౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదని, ప్రతి వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ ఉండదని న్యాయస్థానం గతంలోనే హెచ్చరించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో, విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. తాడపల్లిలో కూర్చుని సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై బురద చల్లిన బ్యాచ్‌లోని ఇతర సభ్యుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ విచారణతో వైసీపీ సోషల్ మీడియా విభాగంలో వణుకు మొదలైంది.
పులివెందులలో భార్గవ్ రెడ్డి విచారణ ముగిసినప్పటికీ, ఆయన ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. పోస్టుల రూపకల్పనలో వాడిన గ్యాడ్జెట్లు, వాట్సాప్ గ్రూపుల సమాచారాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో అరాచకానికి పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో, ఈ కేసు తదుపరి ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Latest