* డీజీపీ బి.శివధర్ రెడ్డి.
*నిబద్ధతకు నిలువుటద్దం.
* డీజీపీకి ఘన వీడ్కోలు.
హైదరాబాద్, మహా
విధి నిర్వహణలో ఏ హోదాలో పనిచేసినా ప్రజలకు న్యాయం చేయడమే పరమావధిగా భావించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి.శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, సోమవారం డీజీపీ కార్యాలయంలోని టీఎన్జీఓస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాలకు పైగా డీజీపీ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. కొత్తగా విధుల్లో చేరిన సిబ్బంది కేవలం నామమాత్రపు బాధ్యతలకు పరిమితం కాకుండా, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం విజయవంతంగా పనిచేయడంలో మినిస్టీరియల్ సిబ్బంది కృషి వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు.
సమావేశంలో శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ.. శివధర్ రెడ్డి తన హయాంలో చేపట్టిన వినూత్న సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆయన సేవలు అమోఘమని, ముఖ్యంగా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆయన చూపిన చొరవ జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిందని ప్రశంసించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అలైవ్ అలైవ్’ వంటి కార్యక్రమాలు చేపట్టి ఎన్నో ప్రాణాలను కాపాడారని ఇతర ఉన్నతాధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీజీలు స్వాతి లక్రా, చారు సిన్హా, అదనపు డీజీ డీఎస్ చౌహాన్ సహా పలువురు ఉన్నతాధికారులు, యూనియన్ నేతలు పాల్గొని శివధర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
మరోవైపు నగరంలోని రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. మల్కాజిగిరి, తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ల పరిధిలో నిర్వహించిన ఈ తనిఖీల్లో మొత్తం 780 కేసులు నమోదు కాగా, వాహనదారులకు రూ. 3.35 లక్షల జరిమానా విధించారు. ఇందులో ప్రధానంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపైనే అత్యధికంగా 644 కేసులు నమోదయ్యాయి. లైసెన్స్ ఉండి కూడా వెంట ఉంచుకోని వాహనదారులపై మరో 136 కేసులు నమోదు చేశారు.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. తిరుమలగిరి డివిజన్లో అత్యధికంగా 448 కేసులు నమోదు కాగా, మల్కాజిగిరి డివిజన్లో 332 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా గోపాలపురం (137 కేసులు), అల్వాల్ (122 కేసులు), మల్కాజిగిరి (107 కేసులు) ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా కనిపించాయి. మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి తిరుమలగిరి, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇద్దరిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు.








