Mahaa Daily Exclusive

  ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య మలుపు. హైకోర్టు జడ్జిని బహిష్కరించిన ఆప్ నేతలు.

Share

  • ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య మలుపు.
  • హైకోర్టు జడ్జిని బహిష్కరించిన ఆప్ నేతలు.
  • కేజ్రీవాల్, సిసోడియాల సంచలన నిర్ణయం.
  • జస్టిస్ స్వరణ్ కాంత శర్మపై పక్షపాత ఆరోపణలు.
  • విచారణకు హాజరుకాబోమని న్యాయమూర్తికే నేరుగా లేఖలు.
  • క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో సీబీఐ న్యాయపోరాటం.

ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన న్యాయపోరాటం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో తమకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ‘క్లీన్ చిట్’ను సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణను ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు బహిష్కరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ్ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తాము విచారణకు హాజరుకాబోమని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు వారిద్దరూ నేరుగా న్యాయమూర్తికే వేర్వేరుగా సుదీర్ఘ లేఖలు రాయడం న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాంధేయ మార్గంలో ‘సత్యాగ్రహం’ పాటిస్తూ న్యాయవ్యవస్థపై విశ్వాసంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వారు ఆ లేఖల్లో పేర్కొన్నారు.

పక్షపాతం ఉందంటూ ఆరోపణలు
జస్టిస్ స్వరణ్ కాంత శర్మ ధర్మాసనం ఎదుట విచారణ జరిగితే నిష్పాక్షికంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని కేజ్రీవాల్ తన లేఖలో ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ లీగల్ ప్యానెల్‌లో సదరు న్యాయమూర్తి పిల్లలు పని చేస్తున్నారని, సీబీఐ ద్వారా కేంద్రం ఈ కేసులో జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. దానికి తోడు, ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన అఖిల భారత అధివక్త పరిషత్ కార్యక్రమాల్లో న్యాయమూర్తి తరచుగా పాల్గొన్నారన్న విషయాన్ని సైతం వారు లేవనెత్తారు. ఈ కారణాల వల్ల ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వరణ్ కాంత శర్మ తప్పుకోవాలని (రెక్యూజల్) గతంలోనే కేజ్రీవాల్, సిసోడియాలు పిటిషన్లు వేశారు.

ఆధారాల్లేవంటూ పిటిషన్ల కొట్టివేత
తనను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలంటూ ఆప్ నేతలు వేసిన రెక్యూజల్ పిటిషన్లను జస్టిస్ స్వరణ్ కాంత శర్మ ఏప్రిల్ 20న 115 పేజీల సుదీర్ఘ ఉత్తర్వులతో కొట్టివేశారు. ఆరోపణలన్నీ కేవలం ఊహాగానాలు, వ్యక్తిగత అనుమానాల మీద ఆధారపడి ఉన్నాయని, పక్షపాతం ఉందనడానికి సరైన చట్టపరమైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక న్యాయమూర్తి తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోవచ్చని ఒక పక్షం భావించినంత మాత్రాన కేసు నుంచి తప్పుకోవాలని కోరడం సరికాదని, ఇలాంటి నిరాధారమైన అభ్యర్థనలు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు హెచ్చరించింది. ఈ పరిణామాల తర్వాతే కేజ్రీవాల్, సిసోడియా తాము ఆ కోర్టుకు రాబోమంటూ తాజాగా లేఖలు రాశారు.

 

క్లీన్ చిట్ నుంచి హైకోర్టు దాకా..
మద్యం పాలసీకి సంబంధించిన కుంభకోణం కేసులో సీబీఐ తగిన ఆధారాలు సమర్పించలేకపోయిందని పేర్కొంటూ.. ఫిబ్రవరి 27, 2026న రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులను ఈ కేసు నుంచి నిర్దోషులుగా (డిశ్చార్జ్) ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వెంటనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. కేజ్రీవాల్ సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. సరిగ్గా ఈ రివిజన్ పిటిషన్ల విచారణ దశలోనే న్యాయమూర్తి, ఆప్ నేతల మధ్య ఈ తాజా వివాదం రాజుకోవడం జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది.

Latest