Mahaa Daily Exclusive

  పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి ఫొటోల మార్ఫింగ్‌ కేసు.

Share

  • పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.
  • ముఖ్యమంత్రి ఫొటోల మార్ఫింగ్‌ కేసు.
  • జగన్ మాజీ సీపీఆర్వోకు దక్కని ఊరట.
  • శ్రీహరి పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం.

ఢిల్లీ, మహా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేసిన కేసులో మాజీ సీఎం జగన్ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, అరెస్టు నుంచి మధ్యంతర ఉపశమనం కలిగించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫొటోలను మార్ఫింగ్ చేయడమే కాకుండా, వాటిని ఉద్దేశపూర్వకంగా వైరల్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కుప్పం ట్రయల్ కోర్టు ఇచ్చిన స్టేషన్ బెయిల్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం సమర్థించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలి ఉన్నట్లు ఫొటోలను మార్ఫింగ్ చేసి, దానికి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జోడించి వైఎస్సార్సీపీ అధికారిక సాషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేయించినట్లు శ్రీహరిపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 15వ తేదీన కుప్పం పోలీసులు ఆయనను తాడేపల్లిలోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఆయన నివాసం నుంచి ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్, కంప్యూటర్ మరియు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ గిరీష్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన సమయంలో, ఈ మార్ఫింగ్ పోస్టుల వెనుక ఉన్న అసలు కుట్ర మరియు శ్రీహరి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.
చంద్రబాబుపై “హత్యా రాజకీయాలు” చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, ‘హిట్లర్ చంద్రబాబు’, ‘నరహంతకుడు సీబీఎన్’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ పోస్టులను రాష్ట్రవ్యాప్తంగా వైరల్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ తరహా ప్రచారాలు కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా ఇవి సాగాయని పోలీసులు అభిప్రాయపడ్డారు. కుప్పంకు చెందిన ఎం. వినోద్ కుమార్ ఫిర్యాదుతో ఐటీ చట్టం కింద నమోదైన ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో శ్రీహరికి చట్టపరమైన చిక్కులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Latest