Mahaa Daily Exclusive

  ముఖ్యమంత్రి తో ఎల్ అండ్ టీ చైర్మన్ భేటీ….

Share

హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని అత్యధునాతన తెలంగాణ రాష్ట్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్ అండ్ టీ చేపడుతున్న పలు కీలక ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ విస్తరణ, నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పారదర్శకతతో కూడిన పెట్టుబడులకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణను పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల పరంగా దేశంలోనే అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, రాష్ట్ర ప్రగతిపై ఆయనకున్న స్పష్టమైన ప్రణాళికలు అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పనితీరును కూడా ఆయన ఆసక్తిగా గమనించారు. ఈ భేటీలో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.