Mahaa Daily Exclusive

  నిబంధనల ముసుగులో రైతుల ‘గోస’…

Share

  • నిబంధనల ముసుగులో రైతుల ‘గోస’.
  •  రాజీవ్‌ రహదారిపై అన్నదాతల ఆందోళన.
  • వడ్ల కుప్పల చెంతే రైతుల ప్రాణాలు పోతున్నా కనికరం లేదా?
  •  ధర్నాలో కూర్చున్న హరీశ్‌ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ధ్వజం.

సిద్దిపేట, మహా.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ చిచ్చు రేపుతోంది. కొత్త నిబంధనల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారంటూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఆదివారం కరీంనగర్-సిద్దిపేట రాజీవ్‌ రహదారిపై మల్లారం స్టేజ్ వద్ద రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సుమారు నెల రోజులుగా ధాన్యం కుప్పల వద్ద వేచి చూస్తున్నా అధికారులు ఒక్క గింజ కూడా సేకరించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌ రావు తన వాహనాన్ని ఆపి, రైతులకు మద్దతుగా రోడ్డుపైనే బైఠాయించారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ రైతులతో కలిసి నినదించారు.
ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, రకరకాల కొర్రీలతో రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. మల్లారం కేంద్రంలో రైతులు 28 రోజులుగా వడ్లు పోసి ఎదురుచూస్తున్నా పట్టించుకునే నాథుడే లేరని, తాలు, బీ-గ్రేడ్ రకమంటూ బస్తాకు రెండు కిలోల అదనపు తూకం వేయాలని అధికారులు వేధించడం అన్యాయమని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం మాత్రమే కాకుండా ఇతర పంటల విషయంలోనూ ప్రభుత్వానిది ఇదే తీరని హరీశ్‌ రావు విమర్శించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక రైతులు తమ సొంత సంచులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో మొక్కజొన్న రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో సన్ ఫ్లవర్ కుప్పలు పోసి 22 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని, అటు జొన్నల కేంద్రాలు ప్రారంభించలేదని, శనగల కొనుగోళ్లు మధ్యలోనే ఆపేశారని గణాంకాలతో సహా వివరించారు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొంటామని చెప్పి, కనీసం పది శాతం కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై హరీశ్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 44 డిగ్రీల భానుడి ప్రతాపానికి తట్టుకోలేక కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వడదెబ్బతో ప్రాణాలు వదులుతున్నా ప్రభుత్వానికి చలనం లేకపోవడం దారుణమన్నారు. “నేను రైతు బిడ్డను” అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆచరణలో మాత్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని మండిపడ్డారు. దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీని, రైతుబంధును ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ‘ఒరిజినల్’ రైతు బిడ్డ కాదని, ఆయన ఒక ‘డూప్లికేట్’ రైతు బిడ్డ అని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని, యుద్ధప్రాతిపదికన ఎటువంటి షరతులు లేకుండా పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని హెచ్చరించారు.