Mahaa Daily Exclusive

  ప్రధాని పర్యటనకు 2620 మందితో పటిష్ట బందోబస్తు…

Share

ప్రధాని పర్యటనకు 2620 మందితో పటిష్ట బందోబస్తు.
* పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో డేగకన్ను.
* కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ.
* ట్రాఫిక్ నియంత్రణకు పక్కా వ్యూహం.
* సీపీ సుమతి వెల్లడి
హైదరాబాద్, మహా.
దేశ ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి నేతృత్వంలో ఏకంగా 2,620 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాని నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచి సభ ముగిసి తిరుగు ప్రయాణం అయ్యేంతవరకు అడుగడుగునా నిఘా నీడలో ఉండేలా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సభా వేదిక ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల మార్గాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్న భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
భద్రతా చర్యల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ తో పాటు పరిసర ప్రాంతాలను అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు. ఈ కెమెరాలన్నింటినీ నేరుగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానం చేసి, ప్రత్యేక సిబ్బంది ద్వారా 24 గంటల పాటు అహర్నిశలు డేగకన్నుతో పర్యవేక్షిస్తున్నట్లు సీపీ సుమతి స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా సభా వేదిక పరిసర ప్రాంతాలను రాత్రి 12 గంటల నుంచి ‘నో ఫ్లై జోన్’గా ప్రకటిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సభకు హాజరయ్యే సాధారణ ప్రజలు, నాయకులు అనుమతి లేని, భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి వస్తువులను తమ వెంట సభా ప్రాంగణంలోకి తీసుకురావద్దని పోలీసులు గట్టిగా సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రధాని పర్యటన, భారీ బహిరంగ సభ కారణంగా నగరవాసులకు, సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికను సిద్ధం చేశారు. వీఐపీల రాకపోకలు, సభకు వచ్చే జనసందోహం నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్ జాం కాకుండా చూసేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ పకడ్బందీ ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏకంగా ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలతో పాటు 24 మంది ఏసీపీ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు మల్కాజ్‌గిరి సీపీ వెల్లడించారు. వీరంతా సభా ప్రాంగణానికి వెళ్లే దారులతో పాటు కీలక కూడళ్లలో ఎప్పటికప్పుడు వాహనాల రద్దీని క్రమబద్ధీకరిస్తూ సాఫీగా రవాణా జరిగేలా బందోబస్తును నిర్వహిస్తారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.