పశ్చిమ బెంగాల్‌లో కమల వికాసం.
* 9వ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణస్వీకారం.
*సోనార్ బంగ్లా యుగం షురూ.
* మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికిన బీజేపీ.
* 98 ఏళ్ల సీనియర్ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ.
* కోల్‌కతాలో అంగరంగ వైభవంగా ఎన్డీయే పండుగ.
* హాజరైన చంద్రబాబు, యోగి.
హైదరాబాద్, మహా.
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. గత పదిహేనేళ్లుగా కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనకు తెరదించుతూ ఆ రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం కొలువుదీరింది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి శనివారం అట్టహాసంగా బాధ్యతలు చేపట్టారు. కోల్‌కతాలోని ప్రసిద్ధ బ్రిగేడ్ గ్రౌండ్‌లో వేలాది మంది అభిమానులు, ఎన్డీయే మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన సువేందు అధికారి.. ఇప్పుడు రాజకీయ రణరంగంలో ఆమెనే మట్టికరిపించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సువేందు అధికారితో పాటే బీజేపీ శాసనసభ్యులు దిలీప్ ఘోశ్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తనియా, నితీశ్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడూ తదితరులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయే అగ్రనేతలు తరలివచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తదితరులు ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒకే వాహనంలో వేదిక వద్దకు చేరుకున్నారు. దారిపొడవునా ఎన్డీయే మద్దతుదారులు మోదీకి అనుకూలంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించగా, ఉభయులూ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ ప్రధాన కార్యక్రమానికి ముందు పలువురు కళాకారులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్య ప్రదర్శనలు, సంగీత వాయిద్యాల ఆలాపనలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ అట్టహాసపు వేడుకలో ఒక అత్యంత ఆసక్తికరమైన, భావోద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. వేదికపై ఉన్న ఒక వృద్ధుడి వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. బెంగాల్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న శుభతరుణంలో, ఆ రాష్ట్రానికి చెందిన 98 ఏళ్ల బీజేపీ సీనియర్ నేత మఖన్‌లాల్ సర్కార్‌ను కమలదళం ప్రత్యేకంగా ఈ వేడుకకు ఆహ్వానించింది. వేదికపై ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు శాలువా కప్పి అత్యంత గౌరవంగా సత్కరించి, పాదాభివందనం చేశారు. స్వతంత్ర భారతంలో జరిగిన జాతీయోద్యమంలో మఖన్‌లాల్ కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా 1952లో కాశ్మీర్‌లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి జాతీయ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అక్కడ భారత జాతీయ జెండాను ఎగురవేసిన సాహసోపేత ఘటనలో ఆయన జైలు జీవితం కూడా గడిపారు. అలాంటి త్యాగధనుడిని ప్రధాని గౌరవించిన తీరు సభికుల కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకంగా నిలిచింది.
బాధ్యతలు చేపట్టడానికి ముందు సువేందు అధికారి ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితమైన సందేశాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగిన దుర్వినియోగ పాలనకు నేటితో ముగింపు పలుకుతున్నామని, ఇది ‘సోనార్ బంగ్లా’ (బంగారు బెంగాల్) యుగానికి అధికారిక ఆరంభమని ఆయన ప్రకటించారు. బెంగాల్‌కు ఇది ఒక చారిత్రాత్మక ఉదయమని, విజనరీ నాయకుడైన ప్రధాని మోదీకి ‘సిటీ ఆఫ్ జాయ్’ (కోల్‌కతా) లోకి స్వాగతం పలకడం గర్వకారణమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత బెంగాల్‌లో ఏర్పడుతున్న తొలి బీజేపీ ప్రభుత్వం ద్వారా పార్టీ స్థాపకుల కలలను సాకారం చేస్తున్నామని, ఇకపై అభివృద్ధి, శాంతి, సుసంపన్నత లక్ష్యాలుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.
ఇటీవల ముగిసిన 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 207 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా నిరాటంకంగా అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్, భవానీపూర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన సువేందు అధికారి.. భవానీపూర్‌లో అప్పటి సిట్టింగ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 15 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు. అంతేకాకుండా, 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు అధికారి సరికొత్త చరిత్రను లిఖించారు.








