Mahaa Daily Exclusive

  బెంగాల్‌ సీఎం గా సువేందునే ఎందుకు ఎంచుకున్నారు?

Share

బెంగాల్‌ సీఎం గా సువేందునే ఎందుకు ఎంచుకున్నారు?
హైదరాబాద్,మహా .
పశ్చిమ బెంగాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సీనియర్ నాయకులు ఎంతో మంది ఉండగా, ఆ నేపథ్యం ఏమాత్రం లేని సువేందు అధికారికే కమలనాథులు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎందుకు కట్టబెట్టారు?

**జెయింట్ కిల్లర్,రెండుసార్లు మమతా బెనర్జీని ఓడించిన ఘనత**

సువేందు అధికారికి ముఖ్యమంత్రి పదవి దక్కడానికి ప్రధాన కారణం ఆయన సాధించిన అసాధారణ విజయాలే. 2021లో నందిగ్రామ్‌ నుంచి, తాజాగా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక భవానీపూర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, అప్పటి సిట్టింగ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరుసగా రెండుసార్లు ఓడించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. “జెయింట్ కిల్లర్” గా అవతరించిన ఆయన ధైర్యానికి, పోరాట పటిమకు బహుమతిగా బీజేపీ ఈ అత్యున్నత పదవిని బహుకరించింది.

**బెంగాల్ తొలి ఓబీసీ సీఎం**

దశాబ్దాల బెంగాల్ రాజకీయ చరిత్రను సువేందు అధికారి తిరగరాశారు. జ్యోతి బసు నుంచి మమతా బెనర్జీ వరకు ముఖ్యమంత్రులైన వారంతా బ్రాహ్మణ, కాయస్థ లేదా బైద్య వంటి ‘భద్రలోక్’ (ఉన్నత) వర్గాలకు చెందిన వారే. కానీ, సువేందును సీఎంగా ఎంచుకోవడం ద్వారా బెంగాల్‌కు మొట్టమొదటి ఓబీసీ ముఖ్యమంత్రిని బీజేపీ అందించింది. ఆయన ఓబీసీ కేటగిరీలోని ‘మహిష్యా’ (వ్యవసాయ ఆధారిత) సామాజిక వర్గానికి చెందినవారు. జనాభాలో సుమారు 10 శాతానికి పైగా ఉన్న ఈ సామాజిక వర్గంతో పాటు, మొత్తం ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ – మతువా, రాజబన్షీ) మద్దతును కూడగట్టడంలో సువేందు కీలకంగా వ్యవహరించారు. 68 ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడమే దీనికి నిదర్శనం.

**భూమిపుత్రుడి ఇమేజ్**

ఇంతకాలం బీజేపీ కేవలం పట్టణాలు, నగరాలు, మరియు భద్రలోక్ సామాజిక వర్గానికే పరిమితమన్న అపవాదును ఈ నిర్ణయంతో చెరిపేసుకుంది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన భూమిపుత్రుడిగా సువేందు తనను తాను మలచుకున్నారు. ఓబీసీ, ఎస్సీ (మతువా, రాజబన్షీ) వర్గాలు ప్రధానంగా నివసించే గ్రామీణ బెంగాల్‌పై పట్టు సాధించాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏఏ అమలు,గిట్టుబాటు ధరల విషయంలో ఈ వర్గాలు బీజేపీ సర్కారు వైపు ఆశగా చూస్తున్నాయి.

**హిందూ ఓట్ల ఏకీకరణలో మాస్టర్ మైండ్**

గతంలో కులాల వారీగా చీలిపోయిన హిందూ ఓటర్లను ఏకతాటిపైకి తీసుకురావడంలో సువేందు అధికారి వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. మైనారిటీల ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా “బెంగాలీ హిందూ గుర్తింపును కాపాడే పోరాటం” అంటూ ఆయన చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోయినా, వారి భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగల సామర్థ్యం, హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన సక్సెస్ బీజేపీ అధిష్టానాన్ని మెప్పించాయి.

**సంస్థాగత లోపాలను పూరించిన క్షేత్ర స్థాయి పోరాట యోధుడు**

బెంగాల్‌లో టీఎంసీతో పోలిస్తే బీజేపీకి బూత్ స్థాయి నెట్‌వర్క్ చాలా బలహీనంగా ఉండేది. సువేందు అధికారి రాకతో ఈ లోపం పూడ్చబడింది. ఆయనకు, ఆయన తండ్రి శిశిర్ అధికారికి పూర్వ మేదినీపూర్ (దీనిని ‘అధికారి కోట’ అని పిలుస్తారు) ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా బలమైన పట్టు ఉంది. దిలీప్ ఘోష్ వంటి నేతలు సంస్థాగత వ్యవహారాలకే పరిమితం కాగా, క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో మమేకమై పోరాడే నాయకుడిగా సువేందు ఎదిగారు. గతంలో టీఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆ పార్టీ లోటుపాట్లపై ఉన్న స్పష్టమైన అవగాహన ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎంతో కలిసివచ్చింది.