తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయస్థానంలో కొండా సురేఖకు చుక్కెదురైంది.
హైడ్రా కూల్చివేతల విషయంలో కొండా సురేఖ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో కేటీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారామె. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువు బఫర్ జోన్ పరిధిలో ఈ కన్వెన్షన్ నిర్మించినప్పటికీ దాన్ని కూల్చివేయకుండా కేటీఆర్ అడ్డుకున్నారని గతంలో ఆరోపించారు.
ఈ క్రమంలో నాగార్జున కుటుంబాన్ని ఈ వివాదంలోకి లాగడం దుమారం రేపింది. టాలీవుడ్ పెద్దలందరూ ఏకం అయ్యారీ విషయంలో. ప్రముఖ నటులు, దర్శకులు, టెక్నీషియన్లు కొండా సురేఖపై ముప్పేట దాడికి దిగారు. ఆమె చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలనీ పట్టుబట్టారు. నాగార్జున భార్య అమల ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సైతం ఫిర్యాదు చేశారు.
అటు కేటీఆర్, ఇటు నాగార్జున వేర్వేరుగా కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. తమ పరువుకు భంగం వాటిల్లేలా, కుటుంబాన్ని కించపరిచేలా వ్యవహరించారంటూ ఆరోపించారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలనీ తాము దాఖలు చేసిన పిటీషన్లల్లో పొందుపరిచారు.
ఇటీవలే నాంపల్లి కోర్టు ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సరికాదని పేర్కొంది. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవనీ స్పష్టం చేసింది. ఇంకెప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది.
అక్కినేని నాగార్జున కుటుంబం, కేటీఆర్‌పై చేసిన ఆ విమర్శలను అన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలనీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అన్ని డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచీ వాటిని తొలగించాలని సూచించింది. కేటీఆర్ కోరిన విధంగా ఆ వీడియోలు, ఆర్టికల్స్‌ను డిలెట్ చేయాలని పేర్కొంది.







