Mahaa Daily Exclusive

  ఇంధన పొదుపు….

Share

  • ఇంధన పొదుపు
  • ప్రధాని కాన్వాయ్ లో తగ్గిన వాహనాలు
  • స్వీయ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ
  • భద్రతా నిబంధనలకు ఎలాంటి భంగం కలగకుండా పలు మార్పులు
  • వీలైనంత మేర ఈవీలను వినియోగించాలని నిర్ణయం

న్యూఢిల్లీ, మహా : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. తన అధికారిక కాన్వాయ్‌లో వినియోగించే వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరమైన చోట మాత్రమే వాహనాలను ఉపయోగించాలని ప్రధాని సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) అధికారులకు సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. దీని కోసం కొత్తగా ఎలాంటి వాహనాలను కొనుగోలు చేయకూడదని ఎస్​పీజీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రి భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ మార్పులు చేపడుతున్నట్లు ఎస్పీజీ వర్గాలు తెలిపాయి. కాన్వాయ్‌ పరిమాణం తగ్గించినప్పటికీ, తమ మార్గదర్శకాల ప్రకారం అన్ని కీలక భద్రతా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతున్నాయని వెల్లడించాయి.

మోదీ బాటలోనే అమిత్​ షా, సీఎంలు

ఇదిలా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, దిల్లీ సీఎం రేఖా గుప్తా,యూపీ సీఎం మోగీ ఆదిత్యనాథ్ కూడా ప్రధాని బాటలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా తన కాన్వాయ్​ను సగ్గానికి పైగా తగ్గించారు. మోహన్​ యాదవ్​ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అమల్లో ఉండే పొదుపు చర్యల్లో భాగంగా, తన కాన్వాయ్‌లో గతంలో ఉన్న 13 వాహనాలకు బదులుగా కేవలం ఎనిమిది మాత్రమే ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.

గతంలో ఎన్ని వాహనాలు వాడేవారు

ప్రధాని కాన్వాయ్‌లో సాధారణంగా అనేక భద్రతా, సహాయక వాహనాలు ఉంటాయి. వీటిలో ఎస్ యూవీలు, భద్రతా ఎస్కార్ట్ వాహనాలు, అంబులెన్సులు, టెక్నాలజీ సంబంధిత సహాయక వాహనాలు ఉంటాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గతంలో ప్రధాని మోదీ వాహన శ్రేణిలో సుమారు 18 నుండి 20 వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్యను సుమారు 9 నుంచి 10 వాహనాలకు తగ్గించారు. ప్రధానమంత్రి వాహన శ్రేణిలో ఉపయోగించే వాహనాల్లో ఎక్కువ భాగం పెద్ద ఎస్ యూవీలే ఉంటాయి. ఇవి లీటరుకు సగటున 6 నుండి 8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఒక అధికారిక పర్యటనలో పీఎం కాన్వాయ్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, గతంలో ఇంధన వినియోగం సుమారు 250 నుండి 300 లీటర్ల వరకు ఉండేది. వాహనాల సంఖ్య సగానికి తగ్గడంతో, ఇప్పుడు ఈ వినియోగం దాదాపు సగానికి తగ్గుతుంది. ప్రతి అధికారిక పర్యటనలో 100 నుండి 150 లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు అని అంచనా వేశారు. ఏడాదిపాటు జరిగే మొత్తం అధికారిక పర్యటనలను పరిగణనలోకి తీసుకుంటే, తాజా నిర్ణయం ద్వారా వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సాధ్యమైన చోట తమ కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ చర్య పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.