- పోలీసుల విచారణకు బండి భగీరథ్ డుమ్మా
- 15 న వస్తానని ఈ మెయిల్
- మరిన్ని సెక్షన్ లను జోడించిన పోలీసులు
- రెండవ సారి బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు
- నేడు హైకోర్టులో భగీరథ్ పిటిషన్ పై విచారణకు అవకాశం
హైదరాబాద్, మహా : మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలను ఎదుర్కుంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయ్యింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లను పోలీసులు జోడించారు. బీఎన్ఎస్ 74, 75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్ బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది.
నిర్ణీత సమయానికి భగీరథ్ పోలీసుల ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ హాజరుకాకపోవడంతో పోలీసులు తదుపరి ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి నోటీసులు జారీ చేస్తారా లేదా చట్టపరంగా ఇతర చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కేంద్రమంత్రి కుమారుడు కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం పెను సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో వెలసిన పోస్టర్లు
పోక్సో కేసు విచారణను ఎదుర్కుంటున్న బండి భగీరథ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడంతో రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తోంది. భగీరథ్ కనిపించడం లేదంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. మరో వైపు కొంత మంది మెట్రో రైలులో భగీరథ్ కనిపించడం లేదంటూ మీకేమైనా తెలుసా అంటూ ప్రచారం చేస్తూ తిరగడం కలకలం రేకెత్తిస్తోంది. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో భగీరథ్ ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు.
పోలీసులకు ఈ మెయిల్ పంపిన భగీరథ్
తనపై నమోదైన పోక్సో కేసు విచారణకు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, విచారణను ఎదుర్కునేందుకు 15 వ తేదీన వస్తానని పేర్కొంటూ భగీరథ్ పోలీసులకు ఈ మెయిల్ లేఖ పంపారు. తనపైనా, తన కుటుంబంపైనా లేనిపోని అబాండాలు వేస్తున్నారని పేర్కొన్న భగీరథ్ కేసు విచారణను పూర్తి స్థాయిలో న్యాయపరంగా ఎదుర్కుంటానని, కేసులో పోలీసులకు పూర్తి సహకరిస్తానని పేర్కొన్నారు. తనకు 12 న తేదీన పోలీసులు నోటీసులు జారీ చేశారని, కేవలం రెండు రోజులు గడువును మాత్రమే కోరుతున్నానని లేఖలో తెలిపారు.








