Mahaa Daily Exclusive

  రేవంత్ నికార్సైన కాంగ్రెస్ సీఎం…

Share

రేవంత్ నికార్సైన కాంగ్రెస్ సీఎం.
* బండి కొడుకుని వదిలే ప్రసక్తే లేదు.
*కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం.
*బీజేపీ సెక్యులర్ ఓట్లకు గండికొడుతోంది.
* టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్.
హైదరాబాద్, మహా.
రాష్ట్ర రాజకీయాలపై, ప్రతిపక్షాల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టి (చిట్ చాట్)లో ఆయన పలు కీలక, సంచలన విషయాలపై స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తూనే.. బీజేపీ ఎంపీల వైఫల్యం, బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు, , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలపై ఆయన నిప్పులు చెరిగారు.
**రేవంత్ నికార్సైన కాంగ్రెస్ సీఎం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ విపక్ష నేత!**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వస్తున్న విమర్శలను మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి ఒక నికార్సైన కాంగ్రెస్ లీడర్ అని, ఆయన వంద శాతం కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరును ఎండగడుతూ.. ప్రజలు కేసీఆర్‌కు ప్రతిపక్ష పాత్రను అప్పగిస్తే, ఆయన మాత్రం ఆ బాధ్యతలను గాలికొదిలేసి కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రతిపక్ష నేతను గౌరవిస్తుందని, కానీ ఆనాడు ఒక దళితుడైన భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్ ఓర్చుకోలేకపోయారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాను దెబ్బతీసేలా తమ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ అప్పట్లో అడ్డగోలుగా కొనుగోలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సముచిత గౌరవం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
**బండి సంజయ్ కొడుకుని రక్షించాల్సిన అవసరం మాకు లేదు..**
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ కుండబద్దలు కొట్టారు. ఈ కేసు విచారణలో ప్రభుత్వ పరంగా కానీ, పోలీసుల పరంగా కానీ ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. అసలు పోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేసిన ఆయన.. బండి సంజయ్ కొడుకుని రక్షించాల్సిన లేదా తప్పించాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. నిందితుడు ఎవరైనా సరే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, ఈ పోరాటంలో బాధితురాలికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇక ఐటీ కారిడార్‌లో బండి సంజయ్ కొడుకు ‘అబ్స్కాండింగ్’ (పరారీ) అయ్యాడంటూ వెలసిన పోస్టర్లను ఎవరు వేశారో, మళ్లీ వాటిని ఎవరు తీసివేశారో తమకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
**తెలంగాణలో బీజేపీ వీక్.. మోదీకి ఆ విషయం అర్థమైంది!**
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనపై మహేష్ కుమార్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము మోదీని కేవలం ప్రధానమంత్రి హోదాలో మాత్రమే చూస్తామని, ఆయన ఏనాడూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తరహాలో అందరినీ కలుపుకుని పోయేలా వ్యవహరించలేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ చాలా వీక్‌గా ఉందన్న వాస్తవం మోదీకి స్పష్టంగా అర్థమైందని, కేవలం ఆ కారణంతోనే ఆయన తెలంగాణకు వచ్చినట్లు తమకు అనిపిస్తోందని అన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం రాష్ట్రానికి కావాల్సిన నిధులు, ప్రాజెక్టులను అడిగే ‘సోయి’ (స్పృహ) కూడా రాష్ట్ర బీజేపీ ఎంపీలకు లేకపోవడం సిగ్గుచేటన్నారు. మోదీ తెలంగాణకు ఏదో ఇస్తాడని ప్రజలు ఆశిస్తే, చివరకు రిక్తహస్తాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. మరోవైపు, పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా కుట్రపూరితంగా సెక్యులర్ (లౌకికవాద) ఓట్లను తొలగించేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
**రికార్డు స్థాయిలో దిగుబడి.. కమ్యూనిస్టుల ఉనికి సజీవం**
రాష్ట్ర వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో పంటలు పండాయని మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. భారీ దిగుబడి రావడం వల్లే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ప్రభుత్వానికి కొంత ఆలస్యం జరిగిందని, రైతులు ఈ వాస్తవాన్ని గమనించాలని ఆయన కోరారు. ఇక వామపక్షాల గురించి ప్రస్తావిస్తూ.. దేశంలో కమ్యూనిస్టులు కనుమరుగయ్యారు అనుకోవడం పొరపాటని, ఇప్పటికీ వారు క్షేత్రస్థాయిలో సజీవంగా, బలంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.