Mahaa Daily Exclusive

  ఆస్తమా బాధితులకు శుభవార్త….

Share

ఆస్తమా బాధితులకు శుభవార్త..
*’చేప ప్రసాదం’ పంపిణీకి ముహూర్తం ఖరారు.
* జూన్ 8 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక ఘట్టం, శ్వాసకోశ బాధితుల సంజీవని అయిన ‘చేప ప్రసాదం’ పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశాన్ని పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు అత్యంత నిష్టగా అందించే ఈ అరుదైన ప్రసాద పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జూన్ 8వ తేదీ రాత్రి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అబిడ్స్‌లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బత్తిని గౌరీ శంకర్ గౌడ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ పాల్గొని ఈ ఏడాది పంపిణీకి సంబంధించిన కీలక వివరాలను ప్రజలకు వెల్లడించారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందికి ఈ ప్రకటన ఎంతో ఊరటనిచ్చింది.
గత 180 ఏళ్లుగా ఆస్తమా రోగుల పాలిట ఆశాకిరణంగా మారుతూ, బత్తిని కుటుంబ వంశస్థులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఈ చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమై, 24 గంటల పాటు అంటే జూన్ 9వ తేదీ రాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది వ్యాధిగ్రస్తులు ఒకట్రెండు రోజుల ముందుగానే ఇక్కడికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సుదీర్ఘమైన వైద్య సేవను గుర్తిస్తూ అగర్వాల్ సమాజ ప్రతినిధులు బత్తిని కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు పాతబస్తీలో అత్యంత రద్దీ మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని, భద్రతా కారణాలు మరియు ప్రజల సౌకర్యార్థం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు మార్చిన విషయం తెలిసిందే.
ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు బత్తిని గౌరీ శంకర్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడటం ఎందుకని భ్రమపెడుతూ, మాటల్లో పెట్టి చేప ప్రసాదాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని నమ్మించి కొందరు కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేప ప్రసాదం పంపిణీ అనేది స్వచ్ఛందంగా చేసే సేవ అని, ఇది పూర్తిగా ఉచితమని, దీనికి ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా ప్రసాదం పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే పోలీసులకు అప్పగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, చేప ప్రసాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్సిల్ చేసి పంపడం జరగదని, స్వయంగా వచ్చిన వారికి మాత్రమే మందును వేస్తామని తేల్చిచెప్పారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 24 గంటల పాటు సాగే ఈ బృహత్తర కార్యక్రమంలో వివిధ కారణాల వల్ల పాల్గొనలేక, ప్రసాదం పొందలేకపోయిన వారు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నిర్వాహకులు భరోసా ఇచ్చారు. పంపిణీ పూర్తయిన తర్వాత కూడా మరో మూడు, నాలుగు రోజుల పాటు కవాడిగూడలోని బత్తిని కుటుంబీకుల సొంత నివాసం వద్ద ఈ చేప ప్రసాదం అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఇంత భారీ ఎత్తున తరలివచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీతో పాటు తెలంగాణ అగర్వాల్ సమాజ్ మరియు అనేక స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యతగా ముందుకు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే రోగులకు, వారి బంధువులకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్నదానం, మంచినీరు, మజ్జిగ, అల్పాహారం వంటి మౌలిక సదుపాయాలను ఉచితంగా అందించేందుకు ఆయా సంస్థలు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.