కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట తీవ్ర ఆందోళన.
* తల్లి శకుంతలమ్మకు గుండెపోటు.
* మెడికవర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స.
హైదరాబాద్, మహా.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆయన మాతృమూర్తి శకుంతలమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆమెకు గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. పరిస్థితి విషమించకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ మహా నగరానికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడుతూ అత్యవసర చికిత్స పొందుతున్నారు.
కుటుంబ సభ్యులు శకుంతలమ్మను గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రముఖ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే అప్రమత్తమైన సీనియర్ కార్డియాలజిస్టుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని అత్యవసరంగా పరీక్షించింది. శకుంతలమ్మకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆమెను బయటపడేసేందుకు తక్షణమే స్పందించిన వైద్య బృందం, అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించి ఆమె గుండెకు విజయవంతంగా స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం ఆమెకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో (ఐసీయూ) ముమ్మర చికిత్స అందిస్తున్నారు.
తన మాతృమూర్తికి గుండెపోటు వచ్చిందన్న విషాద వార్త తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఉద్వేగానికి, ఆందోళనకు గురయ్యారు. వెంటనే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ పక్కనపెట్టి హుటాహుటిన గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. నేరుగా అత్యవసర చికిత్స విభాగం వద్దకు చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి చలించిపోయారు. అనంతరం ఆమెకు అందుతున్న వైద్య సేవలు, స్టెంట్ వేసిన తర్వాత గుండె పనితీరులో వస్తున్న మార్పులు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. శకుంతలమ్మ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.








