Mahaa Daily Exclusive

  బీ రెడీ… మిడ్ పోల్ గ్యారంటీ…

Share

  • బీ రెడీ… మిడ్ పోల్ గ్యారంటీ
  • త్వరలోనే తమిళనాడులో మళ్లీ ఎన్నికలు
  • విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
  • 2029 లోక్ సభ ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలుంటాయన్న స్టాలిన్

చెన్నై, మహా : కొద్ది రోజుల క్రితం జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించడం, విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటం చకా చకా జరిగిపోయాయి. అయితే విజయ్ ప్రభుత్వం ఇంకా పాలనపై పట్టు సాధించక ముందే తమిళనాడులో మళ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమయింది. సుమారు 59 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని స్టాలిన్ జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పిలుపునివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంఖ్యాబలంపై సందిగ్ధత

ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 107 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షమైన కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇస్తున్న డీఎంకే మిత్రపక్షాలు మద్దతుతో విజయ్ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. వీరికి తోడు గత వారం జరిగిన బలపరీక్షలో 25 మంది ఏఐఏడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, ఈ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా లేదా బయటి నుంచి మద్దతు ఇస్తున్న పక్షాలు వెనక్కి తగ్గినా ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని డీఎంకే లెక్కలు వేస్తోంది.

2029 లోక్‌సభతో పాటే ఎన్నికలు?

తిరుచ్చిలో జిల్లా కార్యదర్శులతో జరిగిన సమావేశంలో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలు ఇప్పుడే క్షేత్రస్థాయికి వెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని, సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో కూడా ఓటమి పాలవ్వడంపై ఆయన బాధ్యత వహిస్తూనే, పార్టీని పునర్నిర్మించే పనిలో పడ్డారు.

డిజిటల్ రాజకీయాలపై ఫోకస్

విజయ్ విజయంలో సోషల్ మీడియా పోషించిన పాత్రను స్టాలిన్ గుర్తించారు. గతంలో మనం టీ కొట్టుల దగ్గర చేసే రాజకీయ చర్చలు, ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జరగాలి అని క్యాడర్‌కు సూచించారు. టీవీకే డిజిటల్ ప్రచారంలో తమ కంటే ఎంతో ముందుందని పరోక్షంగా అంగీకరించిన ఆయన, డీఎంకే సోషల్ మీడియా ఉనికిని పెంచాలని ఆదేశించారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించి, ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ధీమాగా విజయ్ వర్గం

మరోవైపు స్టాలిన్ వ్యాఖ్యలపై టీవీకే వర్గాలు ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. తమ వద్ద స్పష్టమైన మెజారిటీ ఉందని, ఐదేళ్ల పాటు పూర్తిస్థాయి పాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి కాలం చెల్లిందని ప్రజలు తీర్పు ఇచ్చారని, స్టాలిన్ వ్యాఖ్యలు కేవలం నిరాశతో చేసినవేనని కొట్టిపారేస్తున్నారు.