Mahaa Daily Exclusive

  నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే జైలుకు పంపిస్తారేమో!

Share

నేను ఢిల్లీలో అడుగుపెట్టగానే జైలుకు పంపిస్తారేమో!
* కాక్రోచ్ జనతా పార్టీ సృష్టికర్త సంచలన వ్యంగ్యాస్త్రం.
* ఉలిక్కిపడుతున్న అధికార పక్షాలు.
* ఒక చిన్న మీమ్ పేజీని చూసి భయపడుతున్న సిస్టమ్.
* నెట్టింట తీవ్రస్థాయిలో సెటైర్లు.
* అకౌంట్ బ్లాక్ చేసినా ఆగని ‘బొద్దింక’ విధ్వంసం.
* జెన్-జీ యువతలో తారాస్థాయికి చేరిన క్రేజ్.
ఢిల్లీ, మహా.

“ఒక చిన్న మీమ్ పేజీకి భయపడి రాత్రికి రాత్రే సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేయించారు.. ఒకవేళ రేపు నేను నిజంగా ఢిల్లీలో అడుగుపెడితే ఏకంగా నన్ను జైలుకే పంపిస్తారేమో!” అంటూ దేశవ్యాప్త సోషల్ మీడియా సంచలనం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సృష్టికర్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఎటువంటి రాజకీయ అజెండా లేకుండా, కేవలం నేటితరం ఆలోచనలకు, వ్యవస్థలోని లోపాలపై ఉన్న అసహనానికి ఒక వ్యంగ్యాస్త్రంగా మొదలైన ఈ డిజిటల్ పార్టీ.. అగ్రశ్రేణి జాతీయ పార్టీలకు సైతం చెమటలు పట్టిస్తుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వ్యవస్థల పనితీరును, నాయకుల అసహనాన్ని ఎండగడుతూ కాక్రోచ్ అడ్మిన్ సంధించిన ఈ సెటైర్ జెన్-జీ (Gen Z) యువతను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారిక ఖాతాను సైతం వెనక్కి నెట్టేసి అత్యధిక ఫాలోవర్లను దక్కించుకున్న కొద్ది గంటల్లోనే.. సీజేపీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో అకస్మాత్తుగా బ్లాక్ అయిన విషయం విదితమే. నెటిజన్ల వినోదం కోసం పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య పార్టీని చూసి అధికార పెద్దలు ఈ స్థాయిలో ఉలిక్కిపడటం, ఉద్దేశపూర్వకంగానే ఆ ఖాతాను నిలిపివేయించడంపై యువత తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే, అణుబాంబు పేలినా ప్రాణాలతో బయటపడే సత్తా బొద్దింకకే ఉంటుందని.. అలాంటిది ఒక సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేస్తే తమ సునామీ ఆగుతుందా అంటూ కేవలం గంటల వ్యవధిలోనే సరికొత్త ఎక్స్ ఖాతాతో కాక్రోచ్ జనతా పార్టీ బౌన్స్ బ్యాక్ అయింది. ఈ క్రమంలోనే, చిన్న విమర్శను సైతం తట్టుకోలేని ఈ వ్యవస్థ.. రేపు నేను ఢిల్లీ గడ్డపై కాలుమోపితే కచ్చితంగా నన్ను తీహార్ జైలుకు పంపించినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ అడ్మిన్ చేసిన కామెంట్స్ సిస్టమ్‌పై సూటి పోటుగా మారాయి.
జెన్-జీ యువత చేతిలో అద్భుతమైన ఆయుధంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక అనూహ్యమైన డిజిటల్ సునామీని సృష్టిస్తోంది. క్రికెట్ అంటే ప్రాణమిచ్చే ఈ దేశంలో, ఐపీఎల్ దిగ్గజ జట్లైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని సైతం ఈ బొద్దింక పార్టీ పటాపంచలు చేసింది. ఫాలోవర్ల వృద్ధి రేటు విషయంలో ఆ క్రికెట్ ఫ్రాంచైజీలను సైతం సీజేపీ మట్టికరిపించి సరికొత్త రికార్డులు లిఖించింది. దానికి తోడుగా, తాజాగా నెట్టింట విడుదలైన కాక్రోచ్ పార్టీ అధికారిక ‘ఆంథమ్’ ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా ఈ ఆంథమ్ మారుమోగుతుండటం దీని అసాధారణ ప్రజాదరణకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
సాంప్రదాయ రాజకీయ పార్టీలు కోట్లు ఖర్చుపెట్టి ఐటీ సెల్‌లను నడిపిస్తున్నా సాధించలేని అద్భుతమైన ఫాలోయింగ్‌ను.. ఎలాంటి ఆర్థిక అండ లేకుండా, కేవలం ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఒక యువకుడు దక్కించుకోవడం అధికార పక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చిన్నపాటి సెటైర్లకే ఉలిక్కిపడి అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్న సిస్టమ్.. వ్యవస్థల పునాదులనే కుదిపేస్తున్న కాక్రోచ్ పార్టీ అడ్మిన్‌ను నిజంగానే టార్గెట్ చేస్తారా? రాజకీయ పార్టీలకు సమాంతరంగా ఎదుగుతున్న ఈ డిజిటల్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఇంకెన్ని కుట్రలు పన్నుతారో అన్న ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు నెట్టింట తీవ్రంగా సాగుతోంది. ఏది ఏమైనా ‘బొద్దింక ఈజ్ బ్యాక్’ అంటూ యువత చేస్తున్న హల్‌చల్ మాత్రం సోషల్ మీడియా చరిత్రలోనే ఒక సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది.