- పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్
- ఇన్ ఫ్లూయన్సర్లు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి
- డ్రగ్స్, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్‌పై యువతకు చైతన్యం కల్పించాలి
- త్వరలో ‘ప్రభాత భేరి’ సామాజిక చైతన్య కార్యక్రమం
- తెలంగాణ టూరిజం ఇన్ ఫ్లూయర్స్ సమావేశం’లో మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, మహా
పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌కు శక్తివంతమైన సాధనం” అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణను వేగవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన సలహాలు సూచనలు స్వీకరించి పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరుస్తామని చెప్పుతునే.. పర్యాటక ప్రమోషన్ తో పాటు ప్రజల్లో ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహ కలిగించడానికి కృషి చేయాలని దిశానిర్ధేశం చేశారు. పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల బలోపేతానికి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు. దేశ, విదేశీ పర్యాటకులతో పాటు స్వరాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ వసతి సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని తెలిపారు. వినియోగంలో లేని హరిత మోటళ్లు, పర్యాటక భూములను ఆదాయ వనరులుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
బాధ్యతగా వ్యవహరించాలి
సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లు కేవలం పర్యాటక ప్రమోషన్‌కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి జూపల్లి సూచించారు. యువత.. గంజాయికి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు, బెట్టింగ్‌కు, ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీటితో మానసిక రుగ్మతకు గురై బంగారు భవిష్యత్తును కొల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక, మానసిక రుగ్మతలను రూపుమాపేందుకు ఇన్ప్లు యెన్సర్లు తమ కంటెంట్ ద్వారా సామాజిక చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
త్వరలో ‘ప్రభాత భేరి’
ప్రభుత్వం ప్రభాత భేరి అనే సరికొత్త సామాజిక చైతన్య కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతుందని, లఘు చిత్రాలు, నాటికలు, రంగస్థల ప్రదర్శనలు, వివిధ కళా రూపాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యచరణను అమలు చేయబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో క్రియేటర్లు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వాములయ్యే కంటెంట్ క్రియేటర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణను ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరఫున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే ‘టైమ్‌లెస్ తెలంగాణ’ వీడియోను ప్రదర్శించారు








