వైద్య రంగంలో తమిళనాడు సర్కార్ సంచలనం.
* ఒకేసారి 8 వేల కొత్త ప్రైవేట్ ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్!
* ఆన్లైన్లో సమాచారం అప్లోడ్ చేస్తే చాలు.
* వెంటనే తాత్కాలిక ధృవపత్రాల జారీ.
*క్షేత్రస్థాయిలో పూర్తి తనిఖీల తర్వాతే శాశ్వత గుర్తింపు.
*’ ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమన్న ఆరోగ్యశాఖ.
చెన్నై, మహా.
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవలను మరింత వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన తమిళనాడు ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయంతో ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన సుమారు 8 వేల ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు తాత్కాలిక అనుమతులు మంజూరు చేస్తూ స్టాలిన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్ వేదికగా అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అప్లోడ్ చేసిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తాత్కాలిక ధృవపత్రాలు (ప్రొవిజనల్ సర్టిఫికేట్స్) జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. వైద్య రంగంలో ఇన్స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడుతూ, పారదర్శకతను పెంచేందుకు ఈ విప్లవాత్మక విధానాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
గతంలో కొత్త ఆసుపత్రుల స్థాపనకు లేదా క్లినిక్‌ల ఏర్పాటుకు అనుమతులు సాధించాలంటే నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ సుదీర్ఘ ప్రక్రియకు స్వస్తి పలుకుతూ ఆరోగ్యశాఖ సరికొత్త సరళీకృత విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నూతన నిబంధనల ప్రకారం.. వైద్య సంస్థల నిర్వాహకులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి, తమ మౌలిక వసతులు, వైద్యుల వివరాలు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు వంటి అవసరమైన సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తక్షణమే వ్యవస్థ స్వయంచాలకంగా (ఆటోమేటెడ్‌గా) తాత్కాలిక అనుమతి పత్రాన్ని జారీ చేస్తుంది. దీని ద్వారా నిర్వాహకులు వెంటనే తమ వైద్య సేవలను ప్రారంభించుకునే వీలుంటుంది.
అయితే, ఈ తాత్కాలిక అనుమతులు పొందిన ఆసుపత్రులపై ప్రభుత్వం నిరంతర నిఘా ఉంచనుంది. తాత్కాలిక ధృవపత్రాలు పొందిన నిర్దిష్ట గడువు లోపు ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం సదరు ఆసుపత్రులను క్షేత్రస్థాయిలో స్వయంగా సందర్శిస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాలు, నిబంధనల అమలు, రోగులకు అందుతున్న సేవల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల్లో అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాతే సదరు యాజమాన్యాలకు పూర్తిస్థాయి శాశ్వత ధృవపత్రాలను జారీ చేయనున్నారు. ఒకవేళ ఆన్లైన్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వైద్య వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏకకాలంలో 8 వేల కొత్త వైద్య కేంద్రాలు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు తక్కువ సమయంలో, అత్యంత చేరువలో వైద్య సేవలు అందుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు, వైద్య రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన విధానం దేశానికే దిక్సూచిగా మారుతుందని తమిళనాడు ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేసింది.







