Mahaa Daily Exclusive

  బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – సర్పంచ్ కలబోయిన మాధవరావు.. 

Share

మణుగూరు, మహా :

బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి బాల్య వివాహాలు లేని భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్ అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని ఉడతానేని నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఏరియాలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్జీఓ (ఎయిడ్) ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహాలు లేని భారత్ అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.

బాల్య వివాహాల వల్ల బాలికలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, పౌష్టికాహార లోపంతో గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలకు రక్తహీనత, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. చిన్న వయసులో వివాహం చేయడం ద్వారా బాలికల విద్య, ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతింటుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారు శిక్షార్హులవుతారని హెచ్చరించారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎస్కే రహీం పాషా, బానోతు గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. గణేష్ రెడ్డి, ఎండి యాకూబ్ అలీ, బొజ్జా త్రిమూర్తులు, ఎయిడ్ సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యులు నాగుల జ్యోతి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ బ్రహ్మం, ఆశా వర్కర్ అటిక స్రవంతి, కుంజా రామకృష్ణ, నిట్ట రాంబాబు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.