Mahaa Daily Exclusive

  ఆదివాసి గూడాల‌ను సంద‌ర్శించిన ఎస్పీ 

Share

  • ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న‌
  • మ‌త్తుకు దూరంగా ఉండాల‌ని హిత‌వు

ఆదిలాబాద్ మ‌హా : మారుమూల ఆదివాసి ప్రాంతాల ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచడం, గ్రామీణ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం శ‌నివారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ గాదిగూడ మండలంలోని మరేగావ్ గ్రామం, హీరాపూర్, పారస్వాడ-బి గ్రామపంచాయతీ పరిధి, గౌరీ గ్రామం, కొలామా గ్రామ తాండా ప్రాంతాల్లో పర్యటించారు. గ్రామస్తులు సంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గౌరీ గ్రామ ప్రజలతో కలిసి ఆదివాసీల అల్పాహారం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు, విద్య, ఉపాధి, రహదారి భద్రత, యువత భవిష్యత్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, మద్యం, గుడుంబా వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుతో పాటు ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను వినియోగించుకొని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలకు పంపించాలని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రతి విద్యార్థి చదువుపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మహిళల విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని గ్రామ పెద్దలకు సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. గ్రామాల్లో గొడవలు, అనవసర వివాదాలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు. వర్షపు నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధానాలను గ్రామాల్లో అమలు చేయాలని కోరారు. గాదిగూడ ప్రాంతంలో యువత, విద్యార్థుల కోసం లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థులకు 250 పార్య పుస్తకాలు,పెన్నులు, 4 గ్రామాల యువతకు 5 వాలీ బాల్ కిట్స్ అందచేసారు. అలాగే త్వరలో అగ్నివీర్ నియామకాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా బాబాలను, ఫకీర్లను విశ్వసించ వద్దని, వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, నార్నూర్ సీఐ అంజమ్మ, గాదిగూడ ఎస్ఐ రమ్య,గ్రామ సర్పంచ్ రాథోడ్ స్వాతి జగన్, మాజీ ఎంపీపీ గోవింద్ రావు, పటేల్ రాజు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.