బెంగళూరులోసైబర్ దోపిడీ.
* డిజిటల్ అరెస్ట్’ పేరుతో ₹24 కోట్ల లూటీ.
*ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత.
* కర్ణాటక సైబర్ కమాండ్ మెరుపు దాడి.
* ఆరుగురు అంతర్రాష్ట్ర కేటుగాళ్ల అరెస్ట్.
* సీనియర్ సిటిజన్‌ను నిలువునా ముంచిన కేటుగాళ్లు.
బెంగళూరు,మహా.
సైబర్ నేరగాళ్లు భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న దోపిడీలు రోజురోజుకూ సరికొత్త పరాకాష్టకు చేరుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఒక వృద్ధురాలిని బలిపశువును చేస్తూ ఏకంగా ₹24 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టిన ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్ కలకలం రేపింది. అయితే, బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత, కర్ణాటక సైబర్ కమాండ్ పోలీసుల మెరుపు వేగంతో స్పందించిన తీరు వల్ల ఒక భారీ అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ సిండికేట్ గుట్టురట్టయింది. ఈ నమ్మశక్యం కాని అంతర్రాష్ట్ర దోపిడీకి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు నాడు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన 74 సంవత్సరాల లక్ష్మి రామమూర్తి అనే సీనియర్ సిటిజన్ ఈ భయంకరమైన సైబర్ వంచనకు గురయ్యారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అగ్రశ్రేణి అధికారులమంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఆమెకు ఫోన్ చేశారు. ఏదో చట్టవిరుద్ధమైన కేసులో ఆమెకు సంబంధం ఉందంటూ తీవ్రంగా భయపెట్టి, నిరంతరం నిఘాలో ఉంచే ‘డిజిటల్ అరెస్ట్’ డ్రామాకు తెరలేపారు. చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోవాలంటే తమ ఖాతాల్లోకి డబ్బులు పంపాలని ఆదేశించడంతో, తీవ్ర భయాందోళనకు లోనైన ఆమె తన జీవితకాల కష్టార్జితాన్ని విడతల వారీగా బదిలీ చేశారు. కర్ణాటక సైబర్ కమాండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రణబ్ మొహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సిండికేట్ ముఠా ఫిబ్రవరి 10 నుండి ఏప్రిల్ 24, 2026 మధ్య కాలంలో కేవలం 26 లావాదేవీల ద్వారా ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుండి ఏకంగా ₹24 కోట్ల రూపాయలను స్వాహా చేసింది. నెలల తరబడి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ భారీ దోపిడీ ఎట్టకేలకు ఏప్రిల్ 24వ తేదీన వెలుగులోకి వచ్చింది. నిందితుల ఒత్తిడి తట్టుకోలేక బాధితురాలు ఐసీఐసీఐ బ్యాంక్ శాఖలో ఏకంగా ₹3 కోట్ల భారీ గోల్డ్ లోన్ (బంగారు రుణం) తీసుకోవడానికి ప్రయత్నించింది. ఒక వృద్ధురాలు అకస్మాత్తుగా అంత పెద్ద మొత్తంలో లోన్ తీసుకోవడానికి ప్రయత్నించడం, ఆమె ప్రవర్తనలో తీవ్ర ఆందోళనను గమనించిన సదరు ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు తక్షణమే రంగంలోకి దిగి విషయాన్ని కర్ణాటక సైబర్ కమాండ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందం వెంటనే బాధితురాలిని కలిసి, కౌన్సిలింగ్ ఇచ్చి ఇది సైబర్ నేరగాళ్ల మోసమని నచ్చజెప్పి తదుపరి సొమ్ము బదిలీ కాకుండా అడ్డుకున్నారు. అనంతరం ఆమె ద్వారా అధికారికంగా లిఖితపూర్వక ఫిర్యాదును నమోదు చేసుకున్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో నిధుల మళ్లింపునకు సంబంధించిన విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. బాధితురాలి నుండి కొల్లగొట్టిన ₹24 కోట్ల రూపాయలను నేరగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న 10 వేర్వేరు బ్యాంకుల్లోని 23 మ్యూల్ అకౌంట్ల (ఇతరుల పేరిట తెరిచిన నకిలీ లేదా అద్దె ఖాతాలు) లోకి మళ్లించినట్లు గుర్తించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సాయంతో పోలీసులు మొదటి లేయర్ (ఫస్ట్ లేయర్) కు సంబంధించిన బ్యాంక్ ఖాతాల నెట్‌వర్క్‌ను అత్యంత వేగంగా ట్రాక్ చేశారు. దౌత్యపరమైన వ్యూహాలతో ఆయా బ్యాంకుల అకౌంట్లను తక్షణమే స్తంభింపజేశారు (ఫ్రీజ్ చేశారు). ఈ క్రమంలోనే బ్యాంక్ ఖాతాల్లో ఉన్న దాదాపు ₹4 కోట్లకు పైగా నగదును వేరే చోటుకు చేరకుండా కాపాడగలిగారు. అంతేకాకుండా, కోర్టు ఉత్తర్వుల ద్వారా అప్పటికే నిందితుల చేతికి చిక్కిన మరో ₹1.46 కోట్ల నగదును రికవరీ చేశారు. ఈ డిజిటల్ అరెస్ట్ కుంభకోణం వెనుక అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ముఠా ఉన్నట్లు తేలడంతో కర్ణాటక సైబర్ కమాండ్ పోలీసులు దేశవ్యాప్తంగా ముమ్మర వేట సాగించారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ , బిహార్ రాష్ట్రాలలో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించి ఆరుగురు కీలక నిందితులను బేడీలు వేశారు.






