Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్…

Share

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
  • సిట్ ముందుకు సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు
  • స్టేట్‌మెంట్‌తో పాటు సాంకేతిక ఆధారాలు సేకరణ

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గత కొంతకాలంగా కుదిపేస్తున్న వివాదాస్పద ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా రోజుల తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేత అయిన శ్రీరాం రెడ్డికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల నేపథ్యంలో సోమవారం ఆయన బషీర్‌బాగ్‌లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ పరిణామంతో ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు మరికొందరు కీలక వ్యక్తుల చుట్టూ బిగుసుకునే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.

శ్రీరాం రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా సుదీర్ఘ కాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం రేవంత్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డిల వ్యక్తిగత వివరాలు వారి అంతర్గత రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు నాటి ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు సిట్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది.

ఈ నేపథ్యంలో శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ఏ కాలంలో ఏ ఏ సంవత్సరాల్లో ట్యాప్ చేశారు? ఆయన ఎవరెవరితో మాట్లాడిన ఆడియో డేటాను ఇంటెలిజెన్స్ రికార్డ్ చేసింది ? అనే సాంకేతిక కోణంలో సిట్ అధికారులు ఆయన నుంచి వివరాలను సేకరించనున్నారు. విచారణలో భాగంగా శ్రీరాంరెడ్డి స్టేట్‌మెంట్‌ను అధికారులు అధికారికంగా రికార్డ్ చేశారు. వీటితో పాటు ఆయనకు సంబంధించిన మొబైల్ ఫోన్ డివైజ్‌లు, కాల్ డేటా రికార్డులు, కొన్ని కీలక సాంకేతిక ఆధారాలను కూడా సిట్ నిపుణులు నిశితంగా పరిశీలించారు. ఈ విచారణ తర్వాత మరికొందరు కాంగ్రెస్ నేతలకు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.